
'ఓటుకు కోట్లు'పై నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఓటుకు కోట్ల కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందా? ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ సమాచారం సేకరిస్తోందా? అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు కేసీఆర్ ప్రభుత్వాలు పోటాపోటీగా నివేదికలు ఇవ్వడం, గవర్నర్ నరసింహన్ కూడా నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం తన సొంత మార్గాల ద్వారా వాస్తవ విషయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ విషయం బయటపడినట్లు చెబుతున్నారు. హస్తిన పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోదీని కలసి ఫోన్ ట్యాంపిగ్‌పై ఫిర్యాదు చేశారు.
అయితే చంద్రబాబును కలవడానికి ముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మోదీ సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన వివరాలను మోదీ ఈ సందర్భంగా అజిత్దోవల్ ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ నుంచి అజిత్ దోవల్ పూర్తి సమాచారం సేకరించి, ఆ వివరాలను ప్రధానికి తెలిపారని తెలుస్తోంది. అజిత్ దోవల్ నుంచి వివరాలు సేకరించిన తర్వాతే చంద్రబాబుతో మోదీ సమావేశం అయినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.