ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగనుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రివర్గంలోకి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీను తీసుకోనున్నారు.
న్యూఢిల్లీ: ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రివర్గంలోకి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీను తీసుకోనున్నట్టు సమాచారం. కాశ్మీర్ సంకీర్ణ సూత్రంలో భాగంగా మెహబూబా ముఫ్తీని కేబినెట్లో బీజేపీ చేర్చుకోనున్నట్టు తెలిసింది. అయితే మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా స్థానంలో మెహబూబాకు స్థానం దక్కింది. గతంలో ప్రమాణ స్వీకారానికి వచ్చి వెనుదిరిగిన శివసేన ఎంపీ అనిల్ దేశాయ్కు ఈసారి చోటు లభించనుంది.
దాంతో ఈసారి కేంద్ర కేబినెట్లో ముగ్గురు మంత్రులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్లో ముక్తార్ అబ్బాస్ నక్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనోజ్ సిన్హాలకు ప్రమోషన్ లభించనుంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 26మంది కేబినెట్, 13మంది స్వతంత్ర, 26మంది సహాయ మంత్రులు ఉన్నారు.