న్యూఢిల్లీ: నల్లధనానికి చెక్ పెట్టే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విదేశాల్లో నల్లధనం పోగేయడం, అక్రమంగా ఆస్తులు కూడబెట్టడాన్ని నిరోధించేందుకు కఠినమైన నిబంధనలను ఇందులో పొందుపరించింది. ఈ నేరాలకు పాల్పడినట్టు తేలితే పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. మంగళవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్... ‘విదేశాల్లో నల్లధనం, ఆస్తులు (కొత్త పన్ను విధింపు) బిల్లు-2015’కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు గురించి కేంద్రం సాధారణ బడ్జెట్‌లో ప్రకటించడం తెలిసిందే.
విదేశాల్లో అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు బయటపడితే ఆ ఆస్తులకు 300 రెట్ల జరిమానా విధించేందుకు బిల్లు దోహదపడుతుంది. ఎలాంటి సెటిల్‌మెంట్లకూ అవకాశం ఉండదు. ఆదాయ పన్ను రిటర్న్స్‌లో విదేశాల్లోని ఆస్తులపై తప్పుడు వివరాలు సమర్పించినా లేదా ఆ ఆస్తులను చూపకపోయినా ఏడేళ్ల జైలు శిక్షను ప్రతిపాదించారు. విదేశాల్లో ఖాతా తెరిచినట్లయితే ఐటీ రిటర్న్స్‌ల్లో ఆ ఖాతా తెరిచిన తేదీని తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది.