జోధ్పూర్ లో పాత నోట్లు మార్చుకున్నాక సిరా గుర్తుతో విదేశీయులు
• బ్యాంకులు, పోస్టాఫీసులకు కేంద్రం ఆదేశం
• ఐటీ శాఖకు నివేదించాలని నిర్దేశం
న్యూఢిల్లీ: నోట్ల మార్పిడికి ఉన్న 50 రోజుల గడువులోగా రూ.2.50 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసే వారి వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలని కేంద్రం అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులను ఆదేశించింది. కరెంటు ఖాతాల్లో అరుుతే రూ.12.50 లక్షల డిపాజిట్లు దాటితే వివరాలు వెల్లడించాలని పేర్కొంది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30లోగా ఒక్కరోజులో రూ. 50 వేలు లేదా ఈ గడువులోగా రూ. 2.50 లక్షలకన్నా ఎక్కువ నగదు డిపాజిట్లు చేసిన ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులకు జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఒక వ్యక్తికి ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జరిగిన ఈ డిపాజిట్ల వివరాలను తెలపాలంటూ ఆర్థిక శాఖ బ్యాంకులు, పోస్టాఫీసుల వార్షిక సమాచార రిటర్నుల (ఏఐఆర్) ఫైలింగ్ నిబంధనలను సవరిస్తూ నోటిఫై చేసింది. ఆయా ఆర్థిక లావాదేవీల వివరాలను 2017, జనవరి 31 నాటికల్లా సమర్పించాలంది. ఇంతకుముందు ఐటీ శాఖ ఏడాదిలో రూ.10 లక్షల డిపాజిట్లు దాటిన ఖాతాల వివరాల గురించే అడిగేది.
లెక్కల్లోచూపని పెద్ద మొత్తాల్లోని డబ్బు డిపాజిట్ చేస్తే పన్ను చట్టాల ప్రకారం 30 శాతం పన్ను, 12 శాతం వడ్డీ, 200 శాతం జరిమానా విధించే అవకాశముంది. నిజారుుతీపరులను వేధించడం తమ ఉద్దేశం కాదని, అక్రమంగా డబ్బుదాచుకున్న వారిపైనే చర్యలుంటాయని పన్ను విభాగం అధికారులు చెప్పారు. 50 రోజులు దాటిన తర్వాత ఈ వివరాలను పరిశీలిస్తామని, ఐటీ రిటర్నులతో వివరాలు సరిపోలుస్తామన్నారు.
చాంతాడంత క్యూలు..
నోట్ల మార్పిడి కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద తోపులాటలు, చాంతాడంత క్యూలు కొనసాగుతూనే ఉన్నారుు. చాలామంది గంటల తరబడి క్యూల్లో నిలబడి విసిగివేసారిపోరుు కనపడుతున్నారు. ఆర్థిక శాఖ, పార్లమెంటు హౌస్ వద్ద ఏటీఎంల వద్ద కూడా భారీ క్యూలు దర్శనమిచ్చారుు. నోట్ల ఇక్కట్లతో దేశవ్యాప్తంగా బుధవారం 7 మంది చనిపోయారు. జార్ఖండ్‌లో ముగ్గురు, యూపీలో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు మృత్యువాత పడ్డారు.
మరో వారం ఇబ్బందులే..
బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత సమస్య కనీసం మరో వారం కొనసాగుతుందని నిఘా నివేదిక వెల్లడించింది. సరిపడా నగదు చలామణిలో లేదని నిఘా, హోం శాఖ అధికారులు చెప్పారు. వీలైనంత త్వరగా ఏటీఎంలన్నీ పనిచేస్తేగానీ భారీ క్యూల బెడద తప్పదన్నారు. ఏటీఎంలలో రూ.500, 2,000 నోట్లను పెట్టేందుకురెండు వారాలు పట్టే అవకాశముంది. కొందరు పదేపదే బ్యాంకుల్లో నగదును మార్చుకుంటున్న నేపథ్యంలో నగదు మార్చుకునే వారి వేలుపై గుర్తువేసే ప్రక్రియ మొదలైంది.
స్వాగతించిన సుబ్బారావు
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్వాగతించారు. దీనివల్ల పెట్టుబడులు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.