ఉమాభారతితో హరీశ్‌రావు భేటీ | central minister uma bharti meeting over water projects | Sakshi
Sakshi News home page

ఉమాభారతితో హరీశ్‌రావు భేటీ

Published Wed, Oct 26 2016 3:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

ఉమాభారతితో హరీశ్‌రావు భేటీ

ఉమాభారతితో హరీశ్‌రావు భేటీ

ఎఫ్‌ఆర్‌బీఎంతో సంబంధం లేకుండా నాబార్డు రుణాలు
సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కేంద్రానికి హరీశ్‌రావు విజ్ఞప్తి
దేవాదులకు కేంద్ర సహకారాన్ని 60 శాతానికి పెంచాలని వినతి


సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయ్‌ యోజన(పీఎంకేఎస్‌వై) పథకంలో భాగంగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల కోసం నాబార్డు ఇచ్చే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి సంబంధం లేకుండా అందజేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులను సమీక్షించేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి మంగళవారం ఉదయం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

‘‘తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులు పీఎంకేఎస్‌వైలో ఉన్నాయి. వాటికోసం నాబార్డు నుంచి తొలి విడతగా రూ.1,500 కోట్ల రుణం విడుదలైంది. అయితే రాష్ట్రంలో రూ. 80 వేల కోట్లతో 99 ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో మూడు కీలక అంశాలను ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లాం. నాబార్డు నుంచి ఇచ్చే రుణం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి సంబంధం లేకుండా ఇవ్వాలి. 11 ప్రాజెక్టుల కోసం అడుగుతున్న రూ.7 వేల కోట్ల రుణాన్ని ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి వెలుపల ఇవ్వాలని కోరాం..’’ అని హరీశ్‌ చెప్పారు.

ఇక దేవాదుల ప్రాజెక్టు మావోయిస్టు ప్రభావిత, రైతు ఆత్మహత్యలు ఉన్న ప్రాంతంలో ఉందని, అందువల్ల దానికి అందిస్తున్న కేంద్ర సాయాన్ని 25 శాతం నుంచి 60 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్ర ఆర్థిక శాఖకు సిఫారసు చేసిందని, ఆ విషయంలో సహకారం కావాలని ఉమాభారతిని కోరామని తెలిపారు. నీతిఆయోగ్‌తో సీఎస్‌ రాజీవ్‌ శర్మ, రాష్ట్ర ఉన్నతాధికారులు సమావేశం కానున్నారని, ఉమాభారతి కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారని వెల్లడించారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై స్పందిస్తూ.. ‘ట్రిబ్యునల్‌కు సంబంధించి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌తో ఈనెల 29న చర్చిస్తాం. కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటాం..’ అని హరీశ్‌ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement