
గంగా ప్రక్షాళనపై మాటలు తప్ప... చేతలేవీ?
వారణాసి: గంగా ప్రక్షాళన అంశంలో ప్రధాని నరేంద్రమోదీ వాగ్దానం చేశారు తప్ప.. ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ ఏడాది పాలన ముగిసింది కానీ.. పవిత్ర 'గంగా' నది ప్రస్తుత పరిస్థితిని పర్యావరణ వేత్తలు, నదులకు సంబంధించిన నిపుణుల చేత అంచనా వేసే ప్రయత్నం కూడా చేయలేదని వారు పేర్కొంటున్నారు. కేంద్రం గత బడ్జెట్ లో రూ.2,037 కోట్లు కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు గంగా నది ప్రక్షాళనకు ఎటువంటి కార్యచరణ చేపట్టలేదని అంటున్నారు.
వారణాసి నగరం ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైనా.. గంగా శుద్ధి పనులు ప్రారంభమవకపోవడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత సెప్టెంబర్ లో వారణాసి, అలహాబాద్ ప్రాంతాలలో ఈ నది నీరు కనీసం స్నానాది కార్యక్రమాలకు పనికిరాదని నిర్ధారించారు. గతేడాది మే 17 న గంగా నదిని కాలుష్య రహితంగా, స్వచ్ఛంగా మారుస్తానిని ప్రధాని మోదీ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే.