
వాలెంటినో, హవాయినస్ సంస్థలు తయారుచేసిన రూ.45 వేల చెప్పుల జత
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన వస్తువులను వినియోగించాలని ఆశపడటం సహజమే. సంపన్నులే కాకుండా మధ్యతరగతి జీవులు సైతం నెలనెలా వాయిదా పద్ధతుల్లో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఊహించిన ధరలతో మార్కెట్లోకి వచ్చే వస్తువులు.. అత్యంత పేలవంగా ఉంటే ఎలాంటి కామెంట్లు వచ్చిపడతాయో..! ఈ చెప్పుల జత గురించి చదివి తెలుసుకుందాం..
వాలెంటినో, హవాయినస్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఓ చెప్పుల జత ధర అక్షరాల రూ.45 వేలు. ధర ఇంత భారీగా ఉంటే ఆ చెప్పులు మరెంత సౌకర్యవంతంగా ఉంటాయోననీ ఊహించుకోకండి. అదంతా వట్టి ట్రాష్ అని ఈ ‘ఖరీదైన’ చెప్పుల జతపై కామెంట్లు పేలుతున్నాయి. అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న పలువురు అసహనంతో కూడిన జోకులు విసురుతున్నారు.
ఫన్నీ కామెంట్లు..
‘మీకెవరి మీదనైనా పగ తీర్చుకోవాలి అనుకుంటే వారి వివరాలతో క్యాష్ ఆన్ డెలివరీపై చెప్పులను ఆర్డర్ చేయండి. 45 వేలు కట్టలేక వాళ్లు కళ్లు తేలేస్తారు. ఇక పీడ విరగడవుతుంది. మళ్లీ మీ జోలికి రారు. ఖరీదైన చెప్పులు కాబట్టి గుళ్లూ, గోపురాలకు వెళ్లినప్పుడు కాపలాగా ఇద్దరు సాయుధులను వాటికి కాపలాగా పెడుతున్నాను. మా బాస్ ఆఫీస్‌కి ఎప్పుడూ ఆలస్యంగా వస్తావ్ అంటూ రొద పెడతాడు. ఇప్పుడు ఈ చెప్పుల కారణంగా ఎక్కడా నిముషం కూడా ఆగకుండా పరుగెత్తుకుంటూ ఆఫీస్‌కు చేరుతున్నాను’ ఇది ఓ వినియోగదారుడి వ్యథ.
ఇక.. ఈ చెప్పులు కొనేందుకు బైక్‌ను అమ్ముకున్నానంటూ ఒకరు.. మారుతి 800 అమ్ముకున్నానని మరొకరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అమెజాన్ చెప్పినట్టు చెప్పులు గొప్పగా ఏం లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి మామూలు చెప్పులేననీ, కాకపోతే కాస్త సౌకర్యవంతంగా ఉన్నాయని అంటున్నారు. ఆర్మీ ఉత్పత్తుల్లో వాడే మెటీరియల్, ఫుచియా రబ్బర్‌తో వీటిని తయారు చేశారు. ఒక వ్యక్తి మూడు జతలు మాత్రమే ఆర్డర్ చేయాలని అమెజాన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొనడం కొసమెరుపు. విశేషమేమంటే ఈ చెప్పులు పురుషుల వాడకం కోసం తయారు చేశారు.