
'ఏడు రోజుల్లో చార్జిషీట్.. రంగంలోకి సీబీఎస్‌ఈ'
గుర్గావ్: దారుణ హత్యకు గురైన రెండో తరగతి బాలుడి కేసు విషయంలో కేసు విషయంలో కేంద్ర మాద్యమిక విద్యా విభాగం(సీబీఎస్‌ఈ) రంగంలోకి దిగింది. గుర్గావ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో నిజనిర్దారణ చేసేందుకు ఇద్దరుతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. రెండు రోజుల్లో కేసు వివరాలను తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ విచారణ కమిటీకి పాఠశాల సహకరించాలని, వాస్తవాలేమిటో వివరించడంతోపాటు ఎఫ్‌ఐఆర్ రిపోర్ట్‌తోపాటు ఇతర వివరాలను తమకు పంపించాలని ఆదేశించింది. ఈ కేసును నిజనిర్దారణ కమిటీ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుందని కూడా స్పష్టం చేసింది.
విచారణలో స్కూల్ నిర్లక్ష్యం, బాధ్యత ఉందని తేలితే పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేస్తామని ఈ సందర్భంగా సీబీఎస్‌ఈ తరుపున హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఉపేంద్ర కుశ్వాహ హెచ్చరించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని కూడా స్పష్టం చేశారు. మరోపక్క, ఈ కేసు విచారణ వాయువేగంతో ముందుకెళుతోంది. వారం రోజుల్లో కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను వేస్తామని ఈ కేసు విచారణ చూస్తున్న గుర్గావ్ పోలీస్ కమిషనర్ సందీప్ ఖిర్వార్ హామీ ఇచ్చారు.
బస్సు కండక్టర్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు స్పష్టమైందని, అయితే, మరేదైనా కోణం ఈ హత్య వెనుక ఉందా, ఈ హత్యకు ఎవరైనా ప్రేరేపించారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ముగ్గురుతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామని, వారంలో కేసు చార్జిషీట్‌ను వేస్తామని స్పష్టం చేశారు. గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే.