చవకగా మెరుగైన వైద్యం
స్టార్టప్‌లు ఈ దిశగా కృషిచేయాలి: ప్రధాని మోదీ
► స్వదేశీ ఉపకరణాల తయారీని ప్రారంభించాలి
► టాటా మెమోరియల్ ఆసుపత్రి 75 ఏళ్ల వేడుకల్లో ప్రధాని
ముంబై: పేదలకు మెరుగైన వైద్యాన్ని తక్కువధరకే అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ దిశగా స్టార్టప్ కంపెనీలు దేశీయంగా వైద్యపరికరాలను రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని ఆయన గురువారం పిలుపునిచ్చారు. ప్రస్తుతం వైద్య పరికరాల కోసం దిగుమతిపైనే ఎక్కువగా ఆధారపడుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టాటా కంపెనీ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు.
టాటా సంస్థ 75 ఏళ్లుగా చేపడుతున్న సేవాకార్యక్రమాలపై రాసిన ‘ఇండెలిబుల్ ఫుట్‌ప్రింట్స్ ఆన్ ద శాండ్స్ ఆఫ్ టైమ్’ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. ‘ప్రతి ఏటా 10 లక్షల మందికి కేన్సర్ నిర్ధారణ అవుతోంది. ఇందులో 6.5 లక్షల మంది చనిపోతున్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల పరిశోధన ప్రకారం.. కేన్సర్ మరణాలు 30 ఏళ్లలో రెట్టిం పుకానున్నాయి’ అని ప్రధాని వెల్లడించారు. రోగులకు చికిత్స చేసే పరికరాల్లో 70% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామ ని.. దీనివల్ల వైద్యం మరింత ఖరీదైందన్నారు.
దిగుమతి పరికరాలతో వైద్యం ఖరీదు
‘వైద్యం ఖర్చు పెరుగుతున్నందున విదేశీ పరికరాలను దిగుమతి చేసుకునే పద్ధతి మారాలి. స్టార్టప్ పరిశ్రమ వైద్య రంగంలో పరిశోధనలపై ప్రత్యేక దృష్టిసారించాలి. దేశీయంగా వైద్య పరికరాల తయారీకి ముందుకు రావాలని కోరుతున్నాను. దీని వల్ల వైద్యం ఖర్చు తగ్గి పేదలకు కూడా అందుబాటుధరల్లోనే ఆరోగ్య సేవలందాలి’ అని ప్రధాని కోరారు. పేదలకు తక్కువ ధరకే అత్యాధునిక వైద్యసేవలందించేందుకు జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించామన్నారు. ఇందుకోసం 15 ఏళ్ల లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మోదీ చెప్పారు.
రానున్న రోజుల్లో దేశ జీడీపీలో 2.5శాతం వైద్య రంగానికి వెచ్చిస్తామన్నారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూ నాణ్యమైన చికిత్సనందించేందుకు ప్రయత్నిస్తున్న వివిధ ఆసుపత్రులను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అధునాతన సాంకేతికత సాయంతో తక్కువ ఖర్చుకే వైద్యం అందించాలన్నారు. ‘మేం అధికారంలోకి రాకముందు 36 కేన్సర్ ఆసుపత్రులు కేన్సర్ గ్రిడ్‌కు అనుసంధానమయ్యా యి. ఈ మూడేళ్లలో ఈ సంఖ్య 108కి చేరింది’ అని మోదీ తెలిపారు.
టాటా మెమోరియల్ ఆసుపత్రి సహకారంతో వారణాసి, ఛండీగఢ్, విశాఖపట్టణం, గువాహటిల్లో నాలుగు కేన్సర్ పరిశోధన కేంద్రాలు అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. కేన్సర్ నిర్మూలనకు టాటా మెమోరియల్ సెంటర్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ‘ప్రతి మనిషికి అగ్నిపరీక్షకన్నా కేన్సర్ తక్కువేం కాదు’ అని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా రతన్ టాటా, టాటా మెమొరియల్ ఆసుపత్రులను ప్రధాని అభినందించారు.