
చెన్నై ఎయిర్ పోర్ట్ మూసివేత
చెన్నై: తమిళనాడులో వర్షాలు మళ్లీ కుండపోతగా కురుస్తున్నాయి. జన జీవనం అతలాకుతలం అవుతోంది. రాజధాని చెన్నై ప్రాంతంలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్ట్లోని రన్ వే పైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు బుధవారం నాడు వెల్లడించారు. చెన్నై-బెంగళూరు మార్గం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వందేళ్ల గరిష్ట వర్షపాతం అక్కడ నమోదైన విషయం విదితమే. వర్షాల కారణంగా తమిళనాడులో ఇప్పటికే 260 మందికి పైగా మృతిచెందడంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే, వచ్చే నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే ఉండొచ్చని వాతావరణశాఖ అధికారులు భావిస్తుండటంతో మరింత నష్టం వాటిల్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.