ఓలా క్యాబ్ డ్రైవర్ ఎంత పనిచేశాడు?
నందనం: తమిళనాడులో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ దారుణానికి తెగబడ్డాడు. బతికుండగానే తన భార్యను కారులో పడేసి నిప్పంటించాడు. ఇద్దరు పిల్లలను కూడా అందులోనే నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయాడు. అయితే, మంటల్లో తగులబడుతున్న ఆ మాతృమూర్తి తన బిడ్డలను కారు అద్దాల నుంచి బయటపడేయడంతో పిల్లలు మాత్రం బ్రతికి బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
నాగరాజు (30) అనే వ్యక్తి తన ఓలా క్యాబ్ లో భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. అయితే, వారి మధ్య ఏదో అంశంపై మాటల యుద్ధం మొదలైంది. అయితే, భర్తను బెదిరించేందుకు క్యాబ్ లో అత్యవసర పరిస్థితుల్లో అవసరానికోసం ఉంచిన పెట్రోల్ ను పోసుకుంది. ఆమె అలా చేసిందో లేదో వెంటనే కారు ఆపిన ఆ భర్త పిల్లలను కూడా అందులోనే ఉంచి డోర్లు వేసి వెంటనే నిప్పంటించి పారిపోయాడు. మంటలు ప్రారంభంకాగానే ఆమె పిల్లలను బయట పంపించగలిగింది. అయితే, తీవ్ర గాయాల కారణంగా ఆస్పత్రిలోనే ఆమె కన్నుమూసింది.