యూపీ అభివృద్ధిలో వివక్ష చూపం
► లోక్‌సభలో ఉత్తరప్రదేశ్ సీఏం ఆదిత్యనాథ్
►యోగికి ఘన స్వాగతం పలికిన సభ్యులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ (యూపీ) అభివృద్ధిలో తమ ప్రభుత్వం వివక్ష చూపదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం లోక్‌సభలో చెప్పారు. తమ ప్రభుత్వం యూపీ ప్రజలందరి కోసం పనిచేస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేశాక తొలిసారి ఆయన లోక్‌సభకు వచ్చారు. సభలో యోగి మాట్లాడుతూ ‘మాప్రభుత్వం ఏ ఒక్క కులం, మతం కోసమో కాకుండా ప్రజలందరి అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ప్రధాని మోదీ మార్గదర్శనంలో అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్‌ను కొత్త నమూనాగా నిలుపుతాం. మోదీ కలలుగన్నట్లుగా యూపీని అవినీతి, అశాంతి రహిత రాష్ట్రంగా మారుస్తాం’అని అన్నారు.
‘నేను రాహుల్ కన్నా ఏడాది చిన్న వాడిని. అఖిలేశ్ కన్నా ఒకటిన్నర సంవత్సరం పెద్దవాడిని. వారి మధ్యలోకి నేను వచ్చాను. వారి ఓటమికి ఇదే కారణం అయ్యుండొచ్చు’అని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గేను చూస్తూ యోగి అన్నారు. గత రెండున్నరేళ్లలో కేంద్రం యూపీకి రూ.2.5 లక్షల కోట్ల నిధులిస్తే, గత సమాజ్‌వాదీ ప్రభుత్వం రూ.78 వేల కోట్లను మాత్రమే ఖర్చు పెట్టిందని యోగి విమర్శించారు. ‘దేశంలో 25 కోట్ల జనధన్ ఖాతాలు ఉన్నాయి. వివిధ కులాలు, మతాలకు చెందిన వారందరూ ఈ ఖాతాలను తీసుకున్నారు. అంటే అక్కడ వివక్షేమీ లేదు’అని యోగి పేర్కొన్నారు. గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ ఇటీవలే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడం తెలిసిందే.
యోగికి అభినందనలు తెలిపిన స్పీకర్
సాయంత్రం 4.30 గంటల సమయంలో యోగి సభలోకి రాగానే సభ్యులు బల్లలు చరుస్తూ, ‘జై శ్రీరాం’అని నినాదాలు చేశారు. ఆర్థిక బిల్లుపై టీడీపీ సభ్యుడు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్న సమయంలో యోగి సభలోకి అడుగుపెట్టారు. .
మోదీ, అమిత్‌షాలను కలిసిన యోగి
యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలను కలిశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రణబ్, బీజేపీ నేత అడ్వాణీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సహా కేంద్రమంత్రుల్ని యోగి కలిశారు.
యోగి 77 శాతం, అమరీందర్ 6 శాతం
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో గోరఖ్‌పూర్ ఎంపీ హోదాలో ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 77శాతం హాజరు సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో నెగ్గి పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ హాజరు కేవలం ఆరు శాతమేనని పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాల్లో వెల్లడైంది. లోక్‌సభ కార్యకలాపాల్లో భాగంగా యోగి మొత్తం 284 ప్రశ్నలు సంధించారు. 56 అంశాలపై చర్చల్లో పాల్గొన్నారు.