యోగికి పదిరోజుల సమయమిచ్చిన హైకోర్టు
నచ్చిన ఆహారాన్ని తినడం, ఆహార పదార్థాల వ్యాపారాన్ని చేపట్టడం జీవన హక్కులో భాగమేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈ విషయంలో సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు పదిరోజుల సమయాన్ని ఇచ్చింది. అక్రమ కబేళాలు, మాసం దుకాణాలపై అణచివేత కారణంగా ప్రజల ఆహార అలవాట్లు, ఉపాధి హక్కులు దెబ్బతినకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించి.. పది రోజుల్లో తమకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌లోని వివిధ రకాల ఆహార అలవాట్లు ప్రజల జీవనవిధానంలో భాగంగా ఉన్నాయని, రాష్ట్ర లౌకిక సంస్కృతిలో ఇవి ముఖ్యభాగమని హైకోర్టు లక్నో ధర్మాసనం విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. తన మాంసం దుకాణం లైసెన్స్‌ను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. మాంసం దుకాణానికి లైసెన్సులు ఇవ్వడంలో యూపీ ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాను వ్యాపారం నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. యూపీలో యోగి ప్రభుత్వం వచ్చాక.. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యాపారం పూర్తిగా పడకేసిన సంగతి తెలిసిందే.