slaughterhouses
-
గాడిదలను చంపేసి చైనాకు పార్సిల్
నైరోబీ: మూగ జీవాలను అమానుషంగా చంపుతుండటంపై వన్యప్రాణి హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున్న నిరసనకు సిద్ధమైపోయాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి చైనా పెద్ద ఎత్తున గాడిదల చర్మాలను దిగుమతి చేయించు కోవడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. గాడిద చర్మంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు ఉంటాయని చైనీయులు నమ్ముతారు. వీటి చర్మాలను ఉడికించి ‘ఎజావో’ అనే ద్రావణాన్ని తయారు చేస్తారు. చైనాలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఎజావో కారణంగా చైనాలో గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గి ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గాడిదల కోసం డ్రాగన్ కంట్రీ కన్ను ఇతర దేశాలపై పండింది. ఆఫ్రికాలోని పలు దేశాల నుంచి గాడిద చర్మాలను అక్రమంగా రవాణా చేయించుకుంటోంది. గాడిదలు జాగ్రత్త..! కెన్యాకు చెందిన జోసెఫ్ కమాంజో కరియుకి గాడిదలపై నీటిని తరలిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఆయన గాడిదలను దొంగలు ఎత్తుకెళ్లారు. చైనా కారణంగా తమ దేశంలో వేళ్లూనుకున్న గాడిద చర్మాల బ్లాక్ మార్కెట్‌పై కరియుకి గళమెత్తాడు. తన లాగే మరెవరూ జీవనాధారం కోల్పోవద్దనీ, ‘మీ గాడిదలు జాగ్రత్త’అనే నినాదంతో అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడు. ఇప్పుడు గనుక ఈ బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోకపోతే.. వచ్చే తరాల వారికి గాడిదల చరిత్రను చెప్పాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘సాధారణంగా గాడిదలను అమ్మకానికి కాకుండా కుటుంబ అవసరాలకోసం, జీవనాధారం కోసం పెంచుతుంటారు. కెన్యాలో గాడిద చర్మాల రవాణాకు అనుమతి పొందిన మూడు కబేళాలు ఉన్నాయి. వీటి చర్మాలకు చైనాలో మంచి డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగా రోజూ వెయ్యి గాడిదలను చంపి వాటి చర్మాన్ని వలుస్తున్నాం. డిమాండ్‌కు తగ్గట్లు సప్లయ్ లేకపోవడంతో.. మధ్యవర్తులు, వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. మంచి ధర చెల్లిస్తుండటంతో వారు గాడిదలను అపహరించి సప్లయ్ చేస్తుస్తున్నార’ని ఓ అధికారి చెబుతున్నారు. కాగా, ఆఫ్రికా వ్యాప్తంగా చెలరేగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వాలు స్పందించాయి. 14 ఆఫ్రికా దేశాలు గాడిదల చర్మం రవాణాపై నిషేదం విధించాయి. గత 9 ఏళ్లుగా కెన్యాలో గాడిదల సంఖ్య మూడోవంతు తగ్గిపోయాయని ఒక సర్వే నివేదిక వెల్లడించింది. గాడిదల సంఖ్య 1.8 మిలియన్ నుంచి 1.2 మిలియన్‌కు పడిపోయింది. అధికారికంగా సగటున రోజుకు వెయ్యి గాడిదల చొప్పున చంపుతుండగా, అనధికారికంగా మరెన్నింటిని అంతమొందిస్తున్నారో ఊహించుకోవచ్చు..!! -
యోగికి పదిరోజుల సమయమిచ్చిన హైకోర్టు
నచ్చిన ఆహారాన్ని తినడం, ఆహార పదార్థాల వ్యాపారాన్ని చేపట్టడం జీవన హక్కులో భాగమేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈ విషయంలో సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు పదిరోజుల సమయాన్ని ఇచ్చింది. అక్రమ కబేళాలు, మాసం దుకాణాలపై అణచివేత కారణంగా ప్రజల ఆహార అలవాట్లు, ఉపాధి హక్కులు దెబ్బతినకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించి.. పది రోజుల్లో తమకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ రకాల ఆహార అలవాట్లు ప్రజల జీవనవిధానంలో భాగంగా ఉన్నాయని, రాష్ట్ర లౌకిక సంస్కృతిలో ఇవి ముఖ్యభాగమని హైకోర్టు లక్నో ధర్మాసనం విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. తన మాంసం దుకాణం లైసెన్స్‌ను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. మాంసం దుకాణానికి లైసెన్సులు ఇవ్వడంలో యూపీ ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాను వ్యాపారం నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. యూపీలో యోగి ప్రభుత్వం వచ్చాక.. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యాపారం పూర్తిగా పడకేసిన సంగతి తెలిసిందే. -
రూ. 56 వేల కోట్లు ఎవరు భరించాలి?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కబేళాలను మూసివేయడం వల్ల ఆర్థికంగా యూపీకి అపార నష్టం వాటిళ్లడమే కాకుండా దేశం కూడా కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. పరోక్షంగా ఆ భారాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు మోయాల్సి ఉంటుంది. యూపీలో కబేళాలపై వేటు వేయడం వల్ల ప్రధానంగా మూడు పరిశ్రమలు దెబ్బతింటాయి. ఫలితంగా 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఏడాదికి రాష్ట్ర ఖజానా దాదాపు 56 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న కబేళాలను మూసివేస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలోనే ప్రకటించింది. చెప్పినట్లుగానే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ అక్రమ కబేళాలను మూసివేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అధికారులు అత్యుత్సాహంతో అక్రమ కబేళాలతో లైసెన్స్ ఉన్న కబేళాలలను కూడా సరైన వసతులు లేవన్న కారణంగా మూసివేశారు. యూపీలో లైసెన్స్ పొందిన కబేళాలు నాలుగువేలుండగా, లైసెన్స్ లేనివి దాదాపు 25వేలు ఉన్నాయి. తాము లైలెన్స్ తీసుకునేందుకు కొంత సమయం కావాలని కబేళాల నిర్వాహకులు అడిగినా వినకుండా ప్రభుత్వం వీటిని మూసివేసింది. దీంతో లైసెన్స్ ఉన్న కబేళా నిర్వాహకులు సమ్మెకు దిగడంతో మాంసం పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. దేశం నుంచి విదేశాలకు వెళుతున్న మొత్తం బీఫ్ మాంసంలో 43 శాతం ఉత్తరప్రదేశ్ నుంచి వెలుతున్నదే. 2015–16 సంవత్సరంలో కూడా యూపీ నుంచి 43 శాతం మాంసం ఎగుమతైనట్లు ‘అగ్రికల్చరర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ అథారిటీ’ లెక్కలు చెబుతున్నాయి. మూడు ప్రధాన పరిశ్రమలకు విఘాతం కబేళాల మూసివేతతో రాష్ట్రంలో మాంసం పరిశ్రమతోపాటు పశుదాణా పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రత్యక్షంగా ఈ పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడనున్నారు. పరోక్షంగా రైతులు, రవాణా కార్మికులు దెబ్బతిననున్నారు. 20 కోట్ల జనాభాతో దేశంలో నెంబర్ వన్‌గా కొన సాగుతున్న యూపీ నిరుద్యోగంలో ఇప్పటికే నెంబర్ టూ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో జార్ఖండ్ రాష్ట్రం ఉంది. సామాజికంగా, ఆర్థికంగా ఏడవ స్థానంలో ఉంది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య జాతీయ సగటు ప్రతి వెయ్యి మందికి 37 మంది ఉండగా, యూపీలో ప్రతి వెయ్యి మందికి 58 మంది ఉన్నారు. ఇక 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్యనున్న నిరుద్యోగుల సంఖ్యను కూడా కలుపుకుంటే జాతీయ సగటు ప్రతి వెయ్యి మందికి 102 మంది ఉండగా, యూపీలో 148 మంది ఉన్నారు. తోళ్ల పరిశ్రమకు పెద్ద దెబ్బ 2015–2016 సంవత్సరంలో దేశం నుంచి 39,396 కోట్ల రూపాయల తోళ్లు, తోళ్ల ఉత్పత్తులు ఎగుమతికాగా, వాటిలో 46 శాతం యూపీ నుంచి జరిగినవే. దేశంలో తోళ్ల పరిశ్రమపై ఆధారపడి దాదాపు 25 లక్షల మంది పనిచేస్తున్నారు. వారిలో మూడొంతుల మంది మహిళలుకాగా, నాలుగు వంతుల మంది గిరిజనులే ఉన్నారు. ఇక బీఫ్ మాంసం ఎదుగుదలకు దాణా ఎంతో ముఖ్యం. ఈ పరిశ్రమ మొత్తం జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.11 శాతం అక్రమించింది. ఈ పరిశ్రమ మూతపడితే రైతులు కూడా దెబ్బ తింటారు. దక్షిణాది రాష్ట్రాలపైనా భారం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి వచ్చే సొమ్ములో 30 శాతం ఐదు ద్రవిడ రాష్ట్రాల నుంచి వెళుతున్నవే. అంటే దేశ జనాభాలో 20 శాతం జనాభా కలిగిన ఈ ఐదు రాష్ట్రాలు పన్నుల రూపంలో 30 శాతం వాటాను భరిస్తున్నాయి. మళ్లీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న వాటాలో అత్యధికంగా లాభ పడుతున్న రాష్ట్రం యూపీనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన ప్రతి రూపాయిలో తిరిగి కేంద్రం నుంచి 67 పైసలురాగా, ఉత్తరప్రదేశ్ చెల్లించిన ప్రతి రూపాయికిగాను ఆ రాష్ట్రానికి వెళుతున్న మొత్తం 1.79 రూపాయలు. ఆ తర్వాత 96 పైసలతో కేంద్రం నుంచి లబ్ధి పొందుతున్న రాష్ట్రం బీహార్. ఇప్పుడు యూపీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతే ఆ భారాన్ని ద్రవిడ రాష్ట్రాలే మోయాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. గతంలో కాకుండా ఇప్పుడు కేంద్రంలోనూ, యూపీలోను బీజేపీయే అధికారంలో ఉంది కనుక ఆ భారం మరింత పెరగవచ్చు. -
సీఎం యోగితో మాంసం వ్యాపారుల భేటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో మాంసం వ్యాపారులు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమావేశం జరిగింది. భేటీ సానుకూలంగా ముగిసిందని మంత్రి ఎస్ ఎన్ సింగ్ తెలిపారు. సీఎం యోగి చర్యలను ప్రతినిధులందరూ(మాంసం వ్యాపారులు) సమర్థించారని వెల్లడించారు. భారత పౌరులుగా తమ కళ్ల ముందు జరుగుతున్న అక్రమాలను నివారించాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ యూపీలోని అక్రమ కబేళాలపై కొరడా ఝుళిపించారు. దీంతో మాంసం వ్యాపారులు ఆందోళనలకు దిగారు. పార్లమెంట్ లోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. అక్రమ కబేళాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని, చట్టబద్దంగా వ్యాపారం చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం యోగితో మాంసం వ్యాపారుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించండి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కబేళాలను మూసివేయించడాన్ని ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ తప్పుపట్టారు. దేశ వ్యాప్తంగా కబేళాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. 'కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కబేళాలు నిర్వహించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేశారు? మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు? దేశ వ్యాప్తంగా కబేళాలపై నిషేధం విధించాలి. ఇలాంటి అంశాలపై దేశమంతా ఒకే చట్టం ఉండాలి' అని ఆజం ఖాన్ అన్నారు. యూపీలో లైసెన్స్ ఉన్న కబేళాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. లైసెన్స్ ఉన్న కబేళాలలో గోవులను వధించవచ్చని, అనుమతి లేని చోట్ల ఈ పని చేయరాదనేది ప్రభుత్వం ఉద్దేశమని అర్థమవుతోందని అన్నారు. లైసెన్స్ ఉన్న, లైసెన్స్ లేని కబేళాలు అన్న పద్దతికి స్వస్తి చెప్పి, అన్నింటినీ మూసివేయించాలని, ఏ జంతువునూ సంహరించరాదని చెప్పారు. కొన్ని మతాలకు చెందిన వారు కోడి, మేక మాంసం కూడా తినరని పేర్కొన్నారు. గొడ్డు మాంసం తినడం మానేయాలని ముస్లింలకు ఆజం ఖాన్ సూచించారు.