సీఎం యోగితో మాంసం వ్యాపారుల భేటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో మాంసం వ్యాపారులు గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమావేశం జరిగింది. భేటీ సానుకూలంగా ముగిసిందని మంత్రి ఎస్ ఎన్ సింగ్ తెలిపారు. సీఎం యోగి చర్యలను ప్రతినిధులందరూ(మాంసం వ్యాపారులు) సమర్థించారని వెల్లడించారు. భారత పౌరులుగా తమ కళ్ల ముందు జరుగుతున్న అక్రమాలను నివారించాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించినట్టు చెప్పారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ యూపీలోని అక్రమ కబేళాలపై కొరడా ఝుళిపించారు. దీంతో మాంసం వ్యాపారులు ఆందోళనలకు దిగారు. పార్లమెంట్ లోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. అక్రమ కబేళాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని, చట్టబద్దంగా వ్యాపారం చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం యోగితో మాంసం వ్యాపారుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.