రూ. 56 వేల కోట్లు ఎవరు భరించాలి? | Meat heat looms large in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

రూ. 56 వేల కోట్లు ఎవరు భరించాలి?

Published Mon, Apr 3 2017 7:24 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

రూ. 56 వేల కోట్లు ఎవరు భరించాలి?

రూ. 56 వేల కోట్లు ఎవరు భరించాలి?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అక్రమ కబేళాలను మూసివేయడం వల్ల ఆర్థికంగా యూపీకి అపార నష్టం వాటిళ్లడమే కాకుండా దేశం కూడా కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. పరోక్షంగా ఆ భారాన్ని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ  రాష్ట్రాలు మోయాల్సి ఉంటుంది. యూపీలో కబేళాలపై వేటు వేయడం వల్ల ప్రధానంగా మూడు పరిశ్రమలు దెబ్బతింటాయి. ఫలితంగా 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఏడాదికి రాష్ట్ర ఖజానా దాదాపు 56 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న కబేళాలను మూసివేస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలోనే ప్రకటించింది. చెప్పినట్లుగానే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్‌ అక్రమ కబేళాలను మూసివేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అధికారులు అత్యుత్సాహంతో అక్రమ కబేళాలతో లైసెన్స్‌ ఉన్న కబేళాలలను కూడా సరైన వసతులు లేవన్న కారణంగా మూసివేశారు. యూపీలో లైసెన్స్‌ పొందిన కబేళాలు నాలుగువేలుండగా, లైసెన్స్‌ లేనివి దాదాపు 25వేలు ఉన్నాయి.

తాము లైలెన్స్‌ తీసుకునేందుకు కొంత సమయం కావాలని కబేళాల నిర్వాహకులు అడిగినా వినకుండా ప్రభుత్వం వీటిని మూసివేసింది. దీంతో లైసెన్స్‌ ఉన్న కబేళా నిర్వాహకులు  సమ్మెకు దిగడంతో మాంసం పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. దేశం నుంచి విదేశాలకు వెళుతున్న మొత్తం బీఫ్‌ మాంసంలో 43 శాతం ఉత్తరప్రదేశ్‌ నుంచి వెలుతున్నదే. 2015–16 సంవత్సరంలో కూడా యూపీ నుంచి 43 శాతం మాంసం ఎగుమతైనట్లు ‘అగ్రికల్చరర్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్‌ అథారిటీ’ లెక్కలు చెబుతున్నాయి.

మూడు ప్రధాన పరిశ్రమలకు విఘాతం
కబేళాల మూసివేతతో రాష్ట్రంలో మాంసం పరిశ్రమతోపాటు పశుదాణా పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రత్యక్షంగా ఈ పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడనున్నారు. పరోక్షంగా రైతులు, రవాణా కార్మికులు దెబ్బతిననున్నారు. 20 కోట్ల జనాభాతో దేశంలో నెంబర్‌ వన్‌గా కొన సాగుతున్న యూపీ నిరుద్యోగంలో ఇప్పటికే నెంబర్‌ టూ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో జార్ఖండ్‌ రాష్ట్రం ఉంది. సామాజికంగా, ఆర్థికంగా ఏడవ స్థానంలో ఉంది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య జాతీయ సగటు ప్రతి వెయ్యి మందికి 37 మంది ఉండగా, యూపీలో ప్రతి వెయ్యి మందికి 58 మంది ఉన్నారు. ఇక 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్యనున్న నిరుద్యోగుల సంఖ్యను కూడా కలుపుకుంటే  జాతీయ సగటు ప్రతి వెయ్యి మందికి 102 మంది ఉండగా, యూపీలో 148 మంది ఉన్నారు.

తోళ్ల పరిశ్రమకు పెద్ద దెబ్బ
2015–2016 సంవత్సరంలో దేశం నుంచి 39,396 కోట్ల రూపాయల తోళ్లు, తోళ్ల ఉత్పత్తులు ఎగుమతికాగా, వాటిలో 46 శాతం యూపీ నుంచి జరిగినవే. దేశంలో తోళ్ల పరిశ్రమపై ఆధారపడి దాదాపు 25 లక్షల మంది పనిచేస్తున్నారు. వారిలో మూడొంతుల మంది మహిళలుకాగా, నాలుగు వంతుల మంది గిరిజనులే ఉన్నారు. ఇక బీఫ్‌ మాంసం ఎదుగుదలకు దాణా ఎంతో ముఖ్యం. ఈ పరిశ్రమ మొత్తం జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.11 శాతం అక్రమించింది. ఈ పరిశ్రమ మూతపడితే రైతులు కూడా దెబ్బ తింటారు.

దక్షిణాది రాష్ట్రాలపైనా భారం
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి వచ్చే సొమ్ములో  30 శాతం ఐదు ద్రవిడ రాష్ట్రాల నుంచి వెళుతున్నవే. అంటే దేశ జనాభాలో 20 శాతం జనాభా కలిగిన ఈ ఐదు రాష్ట్రాలు పన్నుల రూపంలో 30 శాతం వాటాను భరిస్తున్నాయి. మళ్లీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న వాటాలో అత్యధికంగా లాభ పడుతున్న రాష్ట్రం యూపీనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన ప్రతి రూపాయిలో తిరిగి కేంద్రం నుంచి 67 పైసలురాగా, ఉత్తరప్రదేశ్‌ చెల్లించిన ప్రతి రూపాయికిగాను ఆ రాష్ట్రానికి వెళుతున్న మొత్తం 1.79 రూపాయలు. ఆ తర్వాత 96 పైసలతో కేంద్రం నుంచి లబ్ధి పొందుతున్న రాష్ట్రం బీహార్‌. ఇప్పుడు యూపీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతే ఆ భారాన్ని ద్రవిడ రాష్ట్రాలే మోయాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. గతంలో కాకుండా ఇప్పుడు కేంద్రంలోనూ, యూపీలోను బీజేపీయే అధికారంలో ఉంది కనుక ఆ భారం మరింత పెరగవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement