బృందావన్: చిన్నారులు ఆరోగ్యంగా లేకుంటే శక్తివంతమైన నవ భారత నిర్మాణం సాధ్యం కాదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే పోషకాహారం, టీకాలు, పారిశుధ్యం వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని వివరించారు. ‘అక్షయపాత్ర’ 300 కోట్ల మందికి అన్నదానం చేసిన సందర్భంగా సోమవారం బృందావన్‌లోని చంద్రోదయ మందిర్ ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధాని హాజరై చిన్నారులకు భోజనం వడ్డించారు. స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా మొదటి అన్నదానం ప్రారంభించగా 300 కోట్లవ అన్నదానం తాను చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దాదాపు అరగంటపాటు ప్రసంగించిన ఆయన.. అర్హులైన వారికి ఆలోచించకుండా ఇచ్చేదే నిజమైన దానమనీ, అక్షయపాత్ర అటువంటి దానమే చేస్తోందని కొనియాడారు.
దేశవాసుల ఆకలిని తీర్చేందుకు అక్షయపాత్ర చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం 20 మంది చిన్నారులకు స్వయంగా భోజనం వడ్డించారు. కొందరు చిన్నారులకు స్పూన్‌తో తినిపించి, ఆశీర్వదించారు. అంతర్జాతీయ కృష్ణ భక్తుల సంఘం(ఇస్కాన్) నిధులతో నడుస్తున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 14,702 పాఠశాలల్లో బాలలకు మధ్యాహ్నం భోజనం అందజేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు బృందావన్‌లో అత్యంత ఆధునిక వంటశాల ఉంది. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మథుర ఎంపీ హేమమాలిని పాల్గొన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2004లో ఆ రాష్ట్రంలో తమ సంస్థ మొదటి వంటశాలను ప్రారంభించారని అక్షయపాత్ర ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment