భోజనం చేస్తున్న పిల్లలను ఈడ్చుకెళ్లారు
పాట్నా: రోజులు మారుతున్నా కొందరి మనస్తత్వాలు అలాగే ఉండిపోతున్నాయి. కంటికి కనిపించని అనవసర భావోద్వేగాలను నమ్ముకుని కళ్లముందు ఉన్న మనుషులకు దూరంగా ఉంటున్నారు.. దూరం పెడుతున్నారు.. ఛీదరించుకుంటున్నారు. తమ బిడ్డలకు ఓ వితంతువు మధ్యాహ్న భోజనం వండిపెట్టడమేమిటని బిహార్ లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఊగిపోయారు. ఆగ్రహంగా పాఠశాలలోకి ప్రవేశించి ఆ వంట చేసిన మహిళను హెచ్చరించి భోజనం చేస్తున్న తమ పిల్లలను ఈడ్చుకెళ్లారు. గోపాల్ ఘంజ్ జిల్లాలోని కళ్యాణ్ పూర్ అనే గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది.
అందులో మధ్యాహ్న భోజనం సునితఆ కున్వార్ అనే ఓ మహిళ వండుతోంది. అయితే, గతంలోనే ఆమెపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తితో ఉండటం, ఆమె ప్రవర్తన మంచిదికాదని ఫిర్యాదులు చేయడంతో ఓసారి విధుల నుంచి తొలగించి బబితా దేవీ అనే మహిళను నియమించారు. అయితే, ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన మేజిస్ట్రేట్ కోర్టు తిరిగి సునీతనే ఆ విధుల్లో ఉంచాలని ఆదేశించడంతో స్కూల్ తిరిగి సునీతకు వంట బాధ్యతలు అప్పగించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు వచ్చి తమ పిల్లలు భోజనం చేస్తుండగా వారిని ఈడ్చుకెళ్లడమే కాకుండా.. గేట్ కు తాళం వేశారు. ఆమెను తొలగించే వరకు స్కూల్ తెరవడానికి ఒప్పుకోబోమని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ విషయాన్ని పై అధికారులు పరిశీలిస్తున్నారు.