సాక్షి, నేషనల్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాకు భారతీయుల కంటే చైనీయులంటేనా మక్కువా? వలసదారులుగా కాకుండా తాత్కాలిక పర్యటనల కోసం అమెరికా వెళ్లేందుకు అవసరమైన నాన్–ఇమిగ్రంట్ వీసాల జారీ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం నిజమేమోనని అనిపించక మానదు. వైద్య చికిత్సలు, విహారయాత్రలు, వ్యాపారపరమైన సమావేశాలు తదితర అవసరాల కోసం అమెరికా వెళ్లే నిమిత్తం వివిధ దేశాల ప్రజలు ఈ తాత్కాలిక నాన్–ఇమిగ్రంట్ వీసాల కోసం దరఖాస్తు చేస్తారు. ఈ వీసాల విభాగంలో చైనీయులతో పోలిస్తే భారతీయుల దరఖాస్తులు రెట్టింపు సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి.
2006తో పోల్చితే చైనీయుల దరఖాస్తుల తిరస్కరణ రేటు 2016 నాటికి దాదాపు సగానికి తగ్గిపోగా, భారత్‌కు సంబంధించి మాత్రం ఈ రేటులో పెరుగుదల కనిపిస్తోంది. 2006లో భారతీయుల అమెరికా తాత్కాలిక వీసా దరఖాస్తుల్లో దాదాపు 19.5 శాతం తిరస్కరణకు గురికాగా, 2016 నాటికి అది 6.5 శాతం పెరిగి 26 శాతానికి చేరింది. అదే చైనా విషయానికి వస్తే 2006లో ఈ దేశస్తుల దరఖాస్తుల తిరస్కరణ రేటు 24.6 శాతం. 2016 నాటికి ఈ రేటు 12.2 శాతం తగ్గి 12.4 శాతానికి చేరింది.
అంటే దశాబ్దం క్రితం నాటి పరిస్థితి ప్రస్తుతం తారుమారైంది. అప్పట్లో భారతీయులకన్నా చైనీయుల వీసాలను ఎక్కువగా తిరస్కరించిన అమెరికా అధికారులు...ఇప్పుడు మనకన్నా చైనీయులకే ఎక్కువగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత దశాబ్దకాలంలో చైనా నిబంధనలను సరళీకరించి విదేశీ కంపెనీలు తమ దేశంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించడం ఇందుకు దోహదపడి ఉండొచ్చని భావిస్తున్నారు.
కాగా, అమెరికా అత్యధికంగా తాత్కాలిక వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్న దేశాల జాబితాలో క్యూబా తొలి స్థానంలో (81.9 శాతం తిరస్కరణ రేటు) ఉండగా, సౌదీ అరేబియా కేవలం 4 శాతం తిరస్కరణ రేటుతో చివరిస్థానంలో నిలవడం గమనార్హం. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా) దేశాల వరకు చూస్తే దక్షిణాఫ్రికా దేశస్తుల దరఖాస్తులు అతి తక్కువ సంఖ్యలో, 6.8 శాతమే తిరస్కరణకు గురవుతున్నాయి. బ్రిక్స్ దేశాల జాబితాలో భారత్ చిట్టచివరన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment