లక్నో : విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత చిన్మయానంద కేసు మరో మలుపు తిరిగింది. తన కళాశాలలో చదివే విద్యార్థినికి తెలియకుండా నగ్న వీడియోలు తీయడమేగాక, ఆ వీడియోలను ఆ విద్యార్థినికి చూపి బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తమ ఆరోపణలకు కీలకంగా ఉన్న సాక్ష్యాలు కనిపించడం లేదని బాధితురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. తన కూతురు కోర్టు సీల్‌తో ఉన్న అన్ని సాక్ష్యాలను జాగ్రత్తగా తన హాస్టల్ గదిలో భద్రపరిచిందన్నారు. అయితే ఈ కేసు విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఈ నెల 9వ తేదీన ఆ సీల్‌ను ఓపెన్ చేసినప్పటి నుంచి కీలకమైన సాక్ష్యాలు కనిపించడం లేదని ఆరోపించారు.
చిన్మయానంద్‌కు వ్యతిరేకంగా అన్ని సాక్షాలను తన కూతురు భద్రపరిచిందని, కళ్లద్దాలలో అమర్చిన రహస్య కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలు కనిపించని వాటిలో ఉన్నాయని తెలిపారు. తన కూతురి స్నేహితురాలు ఇచ్చిన పెన్ డ్రైవ్ కూడా కనిపించని వాటిలో ఉందన్నారు. బాధితురాలి తండ్రి ఆరోపణలపై సిట్ అధికారులు స్పందించడానికి నిరాకరించారు. 73 ఏళ్ల చిన్మయానంద్ బట్టలు లేకుండా తనతో మసాజ్ చేయించుకోవడాన్ని కళ్లద్దాలలో అమర్చిన రహస్య కెమెరాలతో బాధితురాలు చిత్రీకరించడం తెలిసిందే. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అయ్యాయి. స్వామి నుంచి రాజకీయ నాయకునిగా మారిన చిన్మయానంద్... యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు అత్యంత సన్నిహితుడు. దీంతో పోలీసులు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తనని వేధించడానికే లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, ఇది ఒక రాజకీయ కుట్ర అని చిన్మయానంద్ వాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment