Uttarprasesh
-
ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?
లక్నో: భారతీయులకు వేదకాలం నుంచి గంగానదితో అనుబంధం పెనువేసుకుపోయింది. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. గంగాజలాన్ని చల్లుకుంటే పునీతులవుతారనేది ప్రధాన నమ్మకం.. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది. అతంటి పరమ పావనమైన గంగానది గత కొన్నేళ్లుగా మురికికూపంగా తయారవుతోంది. గత ఏడాది కోవిడ్-19 వల్ల ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాలుష్యం తగ్గడంతో గంగా నది తనను తాను శుభ్రం చేసుకుంది. కానీ కరోనా సెకండ్ వేవ్ సమయంలో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. గంగా పరివాహక ప్రాంతంలోని అనేక నదీ తీరాలు ఆకుపచ్చగా మారుతున్నట్లు తెలుస్తోంది. నీరు విషపూరితంగా మారి, ఆకుపచ్చ రంగులోకి మారుతుందని.. దీనికి గల కారణాన్ని పరిశోధించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. "చెరువులు, సరస్సుల నుంచి నాచు అధికంగా రావడం వల్ల వర్షాకాలంలో గంగానది లేత ఆకుపచ్చగా మారుతుంది. అయితే, ఈసారి ఆ రంగు అధికంగా ఉంది. ఇంతకుముందు ఆకుపచ్చగా మారడం కొన్ని ఘాట్లలో మాత్రమే కనిపించేది. ఇప్పుడు ప్రతిచోటా ఈ విధంగా నీరు రంగు మారి కనిపిస్తోంది. అంతేకాకుండా దీని నుంచి వచ్చే దుర్వాసనకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు" అని వారణాసికి చెందిన లావ్కుష్ సాహ్ని అన్నారు. దీనిపై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని మాల్వియా గంగా పరిశోధనా కేంద్రం ఛైర్మన్ త్రిపాఠి మాట్లాడుతూ.. మైక్రోసిస్టిస్ ఆల్గే (నాచు) వల్ల నది పచ్చగా కనిపించవచ్చు అన్నారు. మైక్రోసిస్టిస్ ప్రవహించే నీటిలో కనిపించదు. కానీ ఎక్కడ నీరు ఆగి పోషకాలకు వృద్ధి జరిగితే మైక్రోసిస్టిస్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది చెరువుల నీటిలో మాత్రమే పెరుగుతుందని ఆయన తెలిపారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సాధారణంగా మార్చి, మే నెలల మధ్య జరుగుతుంది. కానీ ఈ విధంగా రంగు మారడం వల్ల నీరు విషపూరితంగా మారుతుంది. దీంతో ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయని, ఈ నీటిని తాగితే కాలేయానికి హాని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. (చదవండి: రూ. 20లక్షల బిల్లు: మిగతా సొమ్ము కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లండి!) -
Holi 2021: ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్..
రంగుల పండుగ హోలీలో కలర్స్ చల్లుకోవడమే పెద్ద సెలబ్రేషన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ కానిది ఏది లేదు. ఆకర్షణీయమైన రంగులు కూడా కల్తీ అవుతున్నాయి. రకరకాల హానికారక రసాయనాలతో తయారుచేసిన హోలీ రంగులను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిలో కార్సినోజెన్స్ ఉంటున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండడంతో.. వివిధ రకాల మూలికలతో తయారు చేసిన రంగులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యే గుల్లాస్‌కు (ఆకర్షణీయమైన రంగు) దేశంలోనే గాక విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. యూపీలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మోదుగ పూలతో తయారు చేసే గుల్లాస్ రంగులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో పల్లాష్ పువ్వు (బుటియా మోనోస్పెర్మ–శాస్త్రీయ నామం) గా పిలిచే మోదుగ పూలను హోలీ రంగుల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. యూపీలోని వివిధ జిల్లాల్లోని మహిళలు మోదుగ పూల నుంచి రంగులు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ప్రోత్సాహంతో నడిచే ఈ గ్రూపులు గుల్లాస్‌ను తయారు చేస్తున్నాయి. సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలి, వారణాసి, చిత్రకూట్ జిల్లాల్లో మోదుగ పూలను సేకరించి ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, గులాబీ రంగులను తయారు చేస్తున్నారు. ఈ రంగులకు యూపీలోనే గాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.సోన్‌భద్ర భీమా ప్రేరణ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుకు చెందిన సభ్యురాలు కాంచన్ మాట్లాడుతూ..‘‘ మోదుగ పూలను తెంపి వాటిని ఒకరోజుపాటు ఎండలో ఆరబెడతాము. పువ్వులు ఆరిన తరువాత వాటిని నీటిలో వేసి రెండు గంటలపాటు మరిగిస్తాము. పువ్వులు మరిగేటప్పుడు వాటి నుంచి రంగు బయటకు వస్తుంది. పూర్తిగా మరిగాక ఆ నీటిని గంజిపొడితో కలుపుతాము. మూలిక మొక్కల నుంచి తీసిన గంజిపొడిని ఈ నీళ్లతో కలపడంతో అది మంచి రంగులోకి మారి కలర్ తయారవుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ హెర్బల్ గులాల్ తయారు చేయడానికి మాకు పెద్దగా ఖర్చు ఉండదు. సగటున రూ.60 నుంచి 70 రూపాయలకు అవుతుంది. ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్.. ఈ పొడిని మార్కెట్లో రూ.150 నుంచి 200 వరకు విక్రయించడం ద్వారా మంచి లాభం వస్తుంది. మా గ్రూపులో నాతోపాటు మరో 11మంది మహిళలు పనిచేస్తున్నారు. మేమంతా కలిసి మూడు క్వింటాళ్ల రంగును తయారు చేసి సోన్‌భద్రా జిల్లాలో విక్రయిస్తాం’’అని కాంచన్ తెలిపారు.యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ డైరెక్టర్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మేము వంద శాతం రసాయనాలు కలపని రంగులు తయారు చేస్తున్నాం. ఇందుకోసం మోదుగపూలు బాగా ఉపయోగపడుతున్నాయి. సోన్‌భద్రా, మీర్జాపూర్ జిల్లాలోని సెల్ప్‌హెల్ప్ గ్రూపు మహిళలు ఎంతో నిబద్దతతో ఈ రంగులను తయారు చేస్తున్నారు. 32 జిల్లాలోని 4,058 మహిళలు మూలికలతో ఐదు వేల కిలోల రంగును తయారు చేస్తున్నారు. ఈ రంగును రూ.7లక్షలకు విక్రయించారు. రంగులతోపాటు చిప్స్, అప్పడాలు, కజ్జికాయలు వంటి వాటిని కూడా తయారు చేస్తున్నారు’’ అని తెలిపారు. సోన్‌భద్రా రంగులు కావాలని లండన్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ఉత్పత్తులను కోట్ల రూపాయల టర్నోవర్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. కాగా మోదుగ పూలతో తయారు చేసిన రంగులకు మంచి డిమాండ్ వస్తుండడంతో మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఈ పూల మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. మోదుగ పూలు మన చర్మానికి ఎటువంటి హానీ చేయవు. ఫంగల్ ఇన్పెక్షన్స్ నుంచి రక్షించడంతోపాటు కాలుష్యాన్నీ కూడా తగ్గిస్తాయి. అంతేగాక ఉదర సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా మోదుగ పూలతో రంగులు తయారు చేసి హెర్బల్ హోలీ ఆడండి. -
ఆగ్రా పేరు ఇక 'అగ్రవాన్'..!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టాక ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మార్చడం మొదలెట్టారు. ఇప్పడు తాజాగా.. ఆ జాబితాలోకి ఆగ్రా కూడా చేరనుంది. దీనికోసం డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆగ్రా పేరు మార్పుపై ప్రయత్నాలు ప్రారంభించింది. ఆగ్రాకు 'అగ్రవాన్' అని పేరు మార్చడానికి ప్రతిపపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చరితత్రను వెలికితీసే పనిలో పడ్డారు. ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అంబేద్కర్ వర్సిటీలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ పరిశోధనలు ప్రారంభించారు. తాజ్నగర్కు మొదట్లో అగ్రవాన్ అనే పేరు ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన సమస్త సమాచారాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. మహాభారత కాలంలో ఆగ్రా నగరాన్ని అగ్రవాన్, అగ్రబాణ్ అని పిలిచేవారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను వెలికితీస్తున్నట్లు ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ తెలిపారు. -
స్వామిపై లైంగిక ఆరోపణలు.. సాక్ష్యాలు మిస్!
లక్నో : విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత చిన్మయానంద కేసు మరో మలుపు తిరిగింది. తన కళాశాలలో చదివే విద్యార్థినికి తెలియకుండా నగ్న వీడియోలు తీయడమేగాక, ఆ వీడియోలను ఆ విద్యార్థినికి చూపి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తమ ఆరోపణలకు కీలకంగా ఉన్న సాక్ష్యాలు కనిపించడం లేదని బాధితురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. తన కూతురు కోర్టు సీల్‌తో ఉన్న అన్ని సాక్ష్యాలను జాగ్రత్తగా తన హాస్టల్ గదిలో భద్రపరిచిందన్నారు. అయితే ఈ కేసు విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఈ నెల 9వ తేదీన ఆ సీల్‌ను ఓపెన్ చేసినప్పటి నుంచి కీలకమైన సాక్ష్యాలు కనిపించడం లేదని ఆరోపించారు. చిన్మయానంద్‌కు వ్యతిరేకంగా అన్ని సాక్షాలను తన కూతురు భద్రపరిచిందని, కళ్లద్దాలలో అమర్చిన రహస్య కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలు కనిపించని వాటిలో ఉన్నాయని తెలిపారు. తన కూతురి స్నేహితురాలు ఇచ్చిన పెన్ డ్రైవ్ కూడా కనిపించని వాటిలో ఉందన్నారు. బాధితురాలి తండ్రి ఆరోపణలపై సిట్ అధికారులు స్పందించడానికి నిరాకరించారు. 73 ఏళ్ల చిన్మయానంద్ బట్టలు లేకుండా తనతో మసాజ్ చేయించుకోవడాన్ని కళ్లద్దాలలో అమర్చిన రహస్య కెమెరాలతో బాధితురాలు చిత్రీకరించడం తెలిసిందే. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అయ్యాయి. స్వామి నుంచి రాజకీయ నాయకునిగా మారిన చిన్మయానంద్... యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు అత్యంత సన్నిహితుడు. దీంతో పోలీసులు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తనని వేధించడానికే లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, ఇది ఒక రాజకీయ కుట్ర అని చిన్మయానంద్ వాఖ్యానించారు. చదవండి : వీడియో తీసి..బెదిరించి..ఆపై లైంగిక దాడి -
ఆమెకు 95సంవత్సరాలు.. అయినా పోరుకు సై!
-
ఆమెకు 95.. అయినా పోరుకు సై!
ఆగ్రా: దేశమంతటా నేడు ఓటరు దినోత్సవం జరుపుకుంటున్న 95 ఏళ్ల బామ్మ చూపిన స్ఫూర్తి చర్చనీయాంశమైంది. జల్దేవీ అనే ఈ వృద్ధ మహిళ.. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరాఘర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఈమేరకు బుధవారం ఉదయం ఆగ్రాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలుచేసింది. చక్రాలకుర్చీలో వచ్చిన ఆమెను చూసి అధికారులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆమె స్ఫూర్తిని గౌరవించారు. అవసరమైన సూచనలు ఇస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించారు. ఓటరు దినోత్సవం నాడు జల్ దేవీ చూపిన స్ఫూర్తిని ఎన్నికల సంఘంతోపాటు ప్రజాస్వామికవాదూ మెచ్చుకున్నారు. అన్నట్లు, ఈ బామ్మ 2015లో పంచాయితీ బోర్డు మెంబర్‌గానూ భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన పార్టీల మాదిరి హంగూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ప్రచారం చేస్తానని జల్దేవీ చెప్పారు. బీఎస్పీకి చెందిన భగవాన్ సింగ్ కుష్వాహా ప్రస్తుతం ఖేరాఘర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు ఏడు విడతలుగా పోలింగ్ జరగనుంది.