
అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎస్‌ఎన్ శుక్లా
న్యూఢిల్లీ: మెడికల్ కళాశాల ప్రవేశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించిన అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎస్‌ఎన్ శుక్లా తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఆయన్ని తొలగించడానికి సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయించారు. ఈ మేరకు ఆయన నేడోరేపో రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్సు లేఖ రాసే అవకాశాలున్నాయి. జస్టిస్ శుక్లాపై వచ్చిన ఆరోపణలు.. ఆయన తొలగింపు ప్రక్రియను ప్రారంభించేంత తీవ్రమైనవని ముగ్గురు జడ్జీలతో కూడిన కమిటీ నిర్ధారించింది. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తరువాత.. రాజీనామా చేయాలని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని జస్టిస్ శుక్లాకు సీజేఐ సలహా ఇచ్చారు. అందుకు శుక్లా నిరాకరించడంతో ఆయనకు ఎలాంటి కేసు విచారణ బాధ్యతలు అప్పగించొద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీజేఐ ఆదేశించారు. దీంతో జస్టిస్ శుక్లా దీర్ఘకాల సెలవుపై వెళ్లారు.