మా ఇంటికి రండి.. మంచి టీ ఇస్తా: జయలలిత
మా ఇంటికి రండి.. మంచి టీ ఇస్తా: జయలలిత
Published Thu, Dec 8 2016 8:59 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
జయలలితకు తాను అపోలో ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్తాననే నమ్మకం గట్టిగా ఉండేది. ఇంటికి వెళ్లిన తర్వాత ఏం చేయాలనే విషయాలను కూడా ఆమె ఆలోచించి పెట్టుకున్నారు. అంతేకాదు, ఆ విషయాల్లో కొన్నింటిని అక్కడి నర్సులతో కూడా పంచుకున్నారు. అవే విషయాలను జయలలితకు చికిత్స అందించిన నర్సులలో ఒకరైన సీవీ షీలా తాజాగా చెప్పారు. ''నేను ఏం చేయాలో మీరు చెప్పండి, చేస్తాను'' అనే ఆమె చాలా సందర్భాల్లో అన్నారని తెలిపారు. తాము ఆమె వద్దకు వెళ్లినప్పుడు పలకరింపుగా నవ్వేవారని, తమతో మాట్లాడేవారని, చాలా సందర్భాల్లో తమతో సహకరించేవారని షీలా చెప్పారు. తినడం చాలా కష్టమైనా.. అందుకు ప్రయత్నం మాత్రం చేసేవారని అన్నారు. తమలో ప్రతి ఒక్కరి కోసం ఒక్కో స్పూను, ఆమె కోసం మరో స్పూను తినేవారన్నారు. ఆమెకు ఎంతగానో ఇష్టమైన ఉప్మా, పొంగల్, దద్దోజనం, బంగాళాదుంప కూర.. వీటన్నింటినీ ఆమె వ్యక్తిగత కుక్ ఆమెకోసం వండిపెట్టేవాడని తెలిపారు.
అపోలో ఆస్పత్రి కాఫీ ఆమెకు అస్సలు నచ్చేది కాదు. అందుకే ఒకరోజు మొత్తం నర్సులు, డాక్టర్లు అందరినీ పోయెస్ గార్డెన్‌కు రమ్మని చెప్పారు. ''రండి, మా ఇంటికి వెళ్దాం. అక్కడ మీకు కొడైనాడు నుంచి తెప్పించి బెస్ట్ టీ ఇప్పిస్తాను'' అని ఆమె చెప్పినట్లు క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ రమేష్ వెంకటరామన్ చెప్పారు. ఆమెకు మూడు షిఫ్టులలో మొత్తం 16 మంది నర్సులు సేవలందించారు. వాళ్లలో షీలా, ఎంవీ రేణుక, చాముండేశ్వరి అంటే జయలలితకు చాలా ఇష్టమట. 75 రోజుల పాటు తమ ఆస్పత్రిలో ఉన్న ఆమె చాలా సందర్భాల్లో సరదాగా, సహకరిస్తూ, అప్పుడప్పుడు కష్టంగా ఉండేవారని అపోలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది చెప్పారు.
సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి సమయంలో ఆమెను ఎమర్జెన్సీలోకి తీసుకొచ్చారు. నాలుగు గంటల తర్వాత ఆమె వైటల్స్ అన్నీ స్థిరంగానే ఉండటంతో.. లేచి కూర్చుని శాండ్‌విచ్‌లు, కాఫీ కావాలన్నారు. అప్పటినుంచి ఆమె సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంతో పోరాడుతూనే ఉన్నారని ఇంటెన్సివ్ కేర్ సీనియర్ కన్సల్టెంటు డాక్టర్ ఆర్ సెంథిల్‌కుమార్ చెప్పారు. బాగా అలిసిపోయినప్పుడు డ్యూటీ డాక్టర్లతో మాట్లాడేవారని, వాళ్ల హెయిర్ స్టైల్ మార్చుకోవాల్సిందిగా 'ఆదేశించేవార'ని కూడా అన్నారు. ఎంత బిజీగా ఉన్నా మహిళలు తమమీద తాము శ్రద్ధ పెట్టాలని తరచు చెప్పేవారని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సత్యభామ అన్నారు.
చాలా నీరసంగా, అస్సలు మాట్లాడలేని స్థితిలో కూడా ఆమె తన రాజసాన్ని ఏమాత్రం వదులుకోలేదు. ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే ఆమెను సహకరించమని గట్టిగా చెబుతూ, ఆస్పత్రిలో తానే బాస్ అని చెప్పగా.. ఆమె నీరసంగా 'ఈ రాష్ట్రం మొత్తం నా అడ్డా' అని సైగ చేశారట! నవంబర్ 22వ తేదీన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తంజావూరు, అర్వకురుచ్చి, తిరుపరంకుంద్రమ్ స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించిన విషయాన్నికూడా జయ టీవీలో చూశారని, అప్పుడు చిన్నగా నవ్వారని డాక్టర్ సత్యభామ అన్నారు.
కానీ ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది. ఆమె ఒక పాత తమిళ నాటకాన్ని చూస్తున్నప్పుడు ఒక ఇంటెన్సివిస్ట్ ఆమె గదిలోకి వెళ్లారు. ఆమె నవ్వలేదు, మాట్లాడలేదు. చూస్తుంటే శ్వాస అందడం కష్టం అవుతున్నట్లు తెలిసింది. అప్పటికి వెంటిలేటర్ సరిచేసేసరికే ఆమె చుట్టూ ఉన్న మానిటర్లు అన్నింటిలోనూ గీతలు అడ్డంగా సరళరేఖల్లా వచ్చేశాయి. అంటే.. ఆమెకు కార్డియాక్ అరెస్ట్ అయిందని అర్థం. సోమవారం రాత్రి 11.30 గంటలకు జయలలిత మరణించినట్లు ప్రకటించారు. 'నన్ను ఆమె తమిళనాడు అసెంబ్లీకి కూడా తీసుకెళ్తానన్నారు' అంటూ షీలా గద్గద స్వరంతో చెప్పారు.
Advertisement
Advertisement