jayalalithaa demise
-
జయలలిత కూతురు ఈమేనంటూ...
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఒక మహిళ ఫొటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈమె జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారని, ప్రస్తుతం అమెరికాలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారని చెబుతూ ఆమె ఫొటోను గ్రూపులలో తెగ షేర్ చేశారు. కానీ అసలు ఆమెకు, జయలలితకు ఏమాత్రం సంబంధం లేదని తేలిపోయింది. ఆమె ఎవరన్న విషయం ఇన్నాళ్ల పాటు తెలియకపోయినా.. ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి శ్రీపాద చిన్మయి పుణ్యమాని అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఇదే ఫొటో 2014 నుంచే ఇలా తిరుగుతోంది. అప్పట్లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తొలిసారి ఈ ఫొటో బయటకు వచ్చింది. కాస్త సెన్సిబుల్‌గా ఆలోచించేవాళ్లకు ఇలాంటి ఫొటోలు చూస్తే ఎక్కడలేని చికాకు వస్తుంది. కానీ కొంతమంది మాత్రం వీటిని నిజంగానే నమ్మేస్తారు కూడా. ఇంతకీ ఈ ఫొటో వెనక కథ ఏంటి.. ఆమె ఎవరన్న విషయం తెలుసుకోవాలని ఉందా? అదే విషయాన్ని చిన్మయి తన ఫేస్బుక్ పోస్టులో షేర్ చేసింది. ఆమెపేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్. జయలలిత కూతురు కానే కాదు. ఆమె ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలకు, ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్లు తన కుటుంబానికి చాలా బాగా తెలిసిన వాళ్లని, మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి వచ్చారని చిన్మయి తెలిపింది. ప్రముఖ మృదంగ విద్వాన్ వి.బాలాజీ కుటుంబానికి చెందినవారని వివరించింది. ఆయన కచేరీలు అంతగా బిజీగా లేనప్పుడు ప్రముఖ వెబ్ సిరీస్ 'హజ్బ్యాన్డ్'లో నటిస్తారని కూడా తెలిపింది. -
శశికళపై తిరుగుబాటు?
తమిళ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రిగా శశికళకు ఎంతవరకు ఆమోదం లభిస్తుందనేది అనుమానంగానే ఉంది. ఎంజీఆర్ కాలం నుంచి పార్టీలో సీనియర్ నాయకుడిగాను.. ఎంజీఆర్, జయలలిత ఇద్దరి వద్దా మంత్రిగాను పనిచేసిన సీనియర్ నాయకుడు పొన్నయన్ వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. పార్టీ నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. జయలలిత నేతృత్వంలో పార్టీ సమష్టిగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా అంతా కలిసికట్టుగానే ముందుకు సాగుతామని ఆయన అన్నారు. తమిళ ప్రజలకు సేవచేసే వ్యక్తే పార్టీ చీఫ్‌గా ఉంటారని స్పష్టం చేశారు. అయితే ఈ పోస్టును ఇప్పటికిప్పుడే భర్తీ చేయడానికి ఎన్నికలు లేవని తెలిపారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ ఎవరూ లేరని ఆయన చెబుతున్నా.. ఎక్కడా శశికళకు మద్దతిస్తున్నట్లు మాత్రం ఆయన చెప్పలేదు. పార్టీలో కుమ్ములాటలు ఏమీ లేవని అన్నారు. పార్టీలో మిలటరీ క్రమశిక్షణను అమ్మ నెలకొల్పారని, అది ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. రెండు మంత్రివర్గాల్లోనూ పనిచేసిన పొన్నయన్ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆయనకు పార్టీలో మంచి స్థానం కల్పించారు. ఎంజీఆర్ కాలం నుంచి ఉన్న నాయకుల్లో పొన్నయన్, సెంగొటయన్, తంబిదురై, రామచంద్రన్ ముఖ్యులు. వీళ్లంతా కూడా ఇప్పుడు శశికళను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. మొదట్లో ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితకు మద్దతిచ్చిన వాళ్లంతా ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా ఉన్నారు. మన్నార్గుడి మాఫియా (శశికళ కోటరీ)కు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారపగ్గాలు అప్పగించేది లేదని అంతర్గత సంభాషణల్లో చెబుతున్నట్లు తెలిసింది. జయలలిత ఉన్నకాలంలో కూడా ఆమె వద్దకు వెళ్లాలంటే ముందుగా చిన్నమ్మ (శశికళ) పర్మిషన్ ఉండాల్సిందే అనేవారు. దాంతో తీవ్ర అవమానానికి గురైన సీనియర్లు.. ఇప్పుడు ఆమెను పార్టీ అధినేత్రిగా ఎంతవరకు అంగీకరిస్తారన్నది అనుమానమే. మరోవైపు శశికళకు ఎడపాటి పళనిస్వామి, దినకరన్ లాంటి కొంతమంది మాత్రం మద్దతిస్తున్నారు. వీళ్లు ప్రభావం చూపించే అవకాశం లేకపోయినా, తమవంతు ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. -
పార్టీలో, ప్రభుత్వంలో మీరొద్దు: శశికళ
తన సమీప బంధువులలో ఏ ఒక్కరికీ కూడా ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ స్థానం లేదని శశికళ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్స్‌లో తన వాళ్లందరితో నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ఈ విషయం చెప్పినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులలో ఎవరైనా ఏం చెప్పినా అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రులు, పార్టీ కీలక నేతలందరికీ ఆమె చెప్పారంటున్నారు. ప్రస్తుతానికి శశికళ పోయెస్ గార్డెన్స్ నివాసంలోనే ఉంటారని సమాచారం. ప్రస్తుతానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారని, కానీ తర్వాత వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత ఆమె వదిన ఇళవరసి మాత్రం శశికళతో ఉంటారని చెబుతున్నారు. జయలలిత మృతదేహాన్ని రాజాజీ హాల్లో ఉంచినప్పుడు అక్కడంతా శశికళ, ఆమె కుటుంబ సభ్యులే ఉన్నారని.. ఆమె మృతదేహం వద్దకు కొంతమంది వీఐపీలను తప్ప ఎవరినీ రానివ్వలేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. వాస్తవానికి 2011లో ఒకసారి శశికళ సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. తనపై కుట్రపన్నుతున్నారని అప్పట్లో ఆమె చెప్పారు. ఆ తర్వాత సుమారు నాలుగు నెలలకు మళ్లీ శశికళపై సస్పెన్షన్ ఎత్తేసి ఆమెను పార్టీలోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులను మాత్రం ప్యాలెస్‌లోకి అడుగుపెట్టనివ్వలేదు. మళ్లీ జయలలిత మరణం తర్వాతే శశికళ భర్త నటరాజన్ కూడా తెర మీదకు వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ తన బంధువులు పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ చక్రం తిప్పడం మొదలుపెడితే అది మరింత నెగెటివ్ ఫలితాలను తీసుకొస్తుందని శశికళ భావిస్తున్నారని, అందుకే తన బంధువులందరినీ దూరం పెడుతున్నారని అన్నాడీంఎకే వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం తర్వాతే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాల్సిందిగా అన్నాడీఎంకే నాయకులు కోరారని అంటున్నారు. కొంతమంది ఆమెను ముఖ్యమంత్రి కూడా చేయాలనుకున్నారని, కానీ.. తాను మాత్రం ఎలాంటి పదవులు లేకుండానే ప్రజాసేవ చేయాలనుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, పార్టీలో ఎంతమంది ఏం చెప్పినా.. ప్రజామోదం ఎంతవరకు వస్తుందన్నదే శశికళ ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఆమె కుటుంబ సభ్యుల జోక్యం ఉంటుందని భయపడుతున్న కిందిస్థాయి కార్యకర్తల్లో ఎందరిని ఆమె సమాధానపరుస్తారన్నది కూడా అనుమానంగానే ఉంది. అసలు జయలలిత అంతిమయాత్ర సమయంలో తన కుటుంబ సభ్యులు జయ మృతదేహం పక్కనే ఉండేందుకు అనుమతించడం ద్వారానే శశికళ పెద్ద తప్పు చేశారని పార్టీ అగ్ర నాయకుడొకరు వ్యాఖ్యానించారు. జయలలిత మరణించి ఇప్పటికి ఐదు రోజులయినా... 'అమ్మ నుంచి చిన్నమ్మ'కు అధికార మార్పిడి ప్రక్రియ ఏమాత్రం జరగలేదని గుర్తుచేశారు. -
అమ్మ మరణాంతరం కేబినెట్ తొలి భేటీ
చెన్నై : అన్నాడీఎంకే అధినేత జయలలిత మరణం అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు కొత్త కేబినెట్ తొలిసారి భేటీ కాబోతుంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో రేపు ఉదయం 11.30 గంటలకు సెక్రటేరియట్లో మంత్రులు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మంత్రులు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. మీటింగ్ అనంతరం కొత్త మంత్రులు తమ బాధ్యతలు స్వీకరించనున్నారు. జయలలిత మరణించిందనే వార్తను అపోలో ఆసుపత్రి వర్గాలు డిసెంబర్ 5 అర్థరాత్రి ప్రకటించగానే.. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కోలుకుంటున్నారన్న జయలలిత హఠాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురికావడం, తర్వాత అమ్మ ఆరోగ్యం విషమించడం, హుటాహుటిని తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీ కావడం వంటి పలు పరిణామాలు అపోలో ఆసుపత్రిలో చోటుచేసుకున్నాయి. అమ్మ వార్త బయటికి చెప్పిన వెంటనే తమిళనాడు కొత్త సీఎం, మంత్రులచే గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం కూడా చేపించారు. -
అమ్మ మృతిపై అనుమానాలు: ప్రధానికి లేఖ
సుదీర్ఘ కాలం పాటు కమల్‌హాసన్‌తో సహజీవనం చేసి, ఇటీవలే విడిపోయిన ప్రముఖ నటి గౌతమి.. జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ కూడా రాశారు. జయలలిత ఆస్పత్రి పాలు కావడం, అక్కడ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పడం, అంతలోనే ఉన్నట్టుండి మృతి చెందారనడం.. వీటన్నింటిపైనా ఆమె ప్రధానికి రాశారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం అన్ని విషయాలనూ కప్పిపెట్టి ఉంచారని, ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎంత వీఐపీ, వీవీఐపీ వచ్చినా కూడా ఆమె ముఖాన్ని చూపించలేదని అన్నారు. అమ్మ ఆరోగ్యం పట్ల ఎంతో ఆందోళనతో వచ్చినవాళ్లంతా ఆమెను చూసే అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారని గౌతమి అన్నారు. నిజానికి తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలువురికి జయలలిత ఆరోగ్యం, మృతి తదితర విషయాలపై అనుమానాలున్నా, ఎవరూ ఇలా బహిరంగంగా చెప్పలేదు. ఆమె మాత్రం నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇటీవలే ఒకసారి ప్రధాని మోదీని కూడా గౌతమి కలిసి వచ్చారు. అందరికీ ప్రేమమూర్తి, తమిళనాడు ప్రభుత్వాధినేత్రి కూడా అయిన ఆమె ఆరోగ్యం విషయంలో ఇంత రహస్యం ఎందుకు పాటించాల్సి వచ్చిందని గౌతమి ప్రశ్నించారు. ఆమె వద్దకు వెళ్లకుండా నియంత్రించిన వాళ్లు ఎవరు, వాళ్లకున్న అధికారం ఏంటన్నారు. ఆమె ఆరోగ్యం చాలా పాడైనప్పుడు ఆమెకు అందించాల్సిన చికిత్సల గురించి నిర్ణయాలు తీసుకున్నవాళ్లు ఎవరని అడిగారు. ప్రజల మదిలో అలజడి రేపుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల గురించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందని గౌతమి తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటే కుదరదన్నారు. మోదీ తన ఆవేదనను పట్టించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
మా ఇంటికి రండి.. మంచి టీ ఇస్తా: జయలలిత
జయలలితకు తాను అపోలో ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్తాననే నమ్మకం గట్టిగా ఉండేది. ఇంటికి వెళ్లిన తర్వాత ఏం చేయాలనే విషయాలను కూడా ఆమె ఆలోచించి పెట్టుకున్నారు. అంతేకాదు, ఆ విషయాల్లో కొన్నింటిని అక్కడి నర్సులతో కూడా పంచుకున్నారు. అవే విషయాలను జయలలితకు చికిత్స అందించిన నర్సులలో ఒకరైన సీవీ షీలా తాజాగా చెప్పారు. ''నేను ఏం చేయాలో మీరు చెప్పండి, చేస్తాను'' అనే ఆమె చాలా సందర్భాల్లో అన్నారని తెలిపారు. తాము ఆమె వద్దకు వెళ్లినప్పుడు పలకరింపుగా నవ్వేవారని, తమతో మాట్లాడేవారని, చాలా సందర్భాల్లో తమతో సహకరించేవారని షీలా చెప్పారు. తినడం చాలా కష్టమైనా.. అందుకు ప్రయత్నం మాత్రం చేసేవారని అన్నారు. తమలో ప్రతి ఒక్కరి కోసం ఒక్కో స్పూను, ఆమె కోసం మరో స్పూను తినేవారన్నారు. ఆమెకు ఎంతగానో ఇష్టమైన ఉప్మా, పొంగల్, దద్దోజనం, బంగాళాదుంప కూర.. వీటన్నింటినీ ఆమె వ్యక్తిగత కుక్ ఆమెకోసం వండిపెట్టేవాడని తెలిపారు. అపోలో ఆస్పత్రి కాఫీ ఆమెకు అస్సలు నచ్చేది కాదు. అందుకే ఒకరోజు మొత్తం నర్సులు, డాక్టర్లు అందరినీ పోయెస్ గార్డెన్‌కు రమ్మని చెప్పారు. ''రండి, మా ఇంటికి వెళ్దాం. అక్కడ మీకు కొడైనాడు నుంచి తెప్పించి బెస్ట్ టీ ఇప్పిస్తాను'' అని ఆమె చెప్పినట్లు క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ రమేష్ వెంకటరామన్ చెప్పారు. ఆమెకు మూడు షిఫ్టులలో మొత్తం 16 మంది నర్సులు సేవలందించారు. వాళ్లలో షీలా, ఎంవీ రేణుక, చాముండేశ్వరి అంటే జయలలితకు చాలా ఇష్టమట. 75 రోజుల పాటు తమ ఆస్పత్రిలో ఉన్న ఆమె చాలా సందర్భాల్లో సరదాగా, సహకరిస్తూ, అప్పుడప్పుడు కష్టంగా ఉండేవారని అపోలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి సమయంలో ఆమెను ఎమర్జెన్సీలోకి తీసుకొచ్చారు. నాలుగు గంటల తర్వాత ఆమె వైటల్స్ అన్నీ స్థిరంగానే ఉండటంతో.. లేచి కూర్చుని శాండ్విచ్లు, కాఫీ కావాలన్నారు. అప్పటినుంచి ఆమె సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంతో పోరాడుతూనే ఉన్నారని ఇంటెన్సివ్ కేర్ సీనియర్ కన్సల్టెంటు డాక్టర్ ఆర్ సెంథిల్‌కుమార్ చెప్పారు. బాగా అలిసిపోయినప్పుడు డ్యూటీ డాక్టర్లతో మాట్లాడేవారని, వాళ్ల హెయిర్ స్టైల్ మార్చుకోవాల్సిందిగా 'ఆదేశించేవార'ని కూడా అన్నారు. ఎంత బిజీగా ఉన్నా మహిళలు తమమీద తాము శ్రద్ధ పెట్టాలని తరచు చెప్పేవారని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సత్యభామ అన్నారు. చాలా నీరసంగా, అస్సలు మాట్లాడలేని స్థితిలో కూడా ఆమె తన రాజసాన్ని ఏమాత్రం వదులుకోలేదు. ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే ఆమెను సహకరించమని గట్టిగా చెబుతూ, ఆస్పత్రిలో తానే బాస్ అని చెప్పగా.. ఆమె నీరసంగా 'ఈ రాష్ట్రం మొత్తం నా అడ్డా' అని సైగ చేశారట! నవంబర్ 22వ తేదీన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తంజావూరు, అర్వకురుచ్చి, తిరుపరంకుంద్రమ్ స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించిన విషయాన్నికూడా జయ టీవీలో చూశారని, అప్పుడు చిన్నగా నవ్వారని డాక్టర్ సత్యభామ అన్నారు. కానీ ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది. ఆమె ఒక పాత తమిళ నాటకాన్ని చూస్తున్నప్పుడు ఒక ఇంటెన్సివిస్ట్ ఆమె గదిలోకి వెళ్లారు. ఆమె నవ్వలేదు, మాట్లాడలేదు. చూస్తుంటే శ్వాస అందడం కష్టం అవుతున్నట్లు తెలిసింది. అప్పటికి వెంటిలేటర్ సరిచేసేసరికే ఆమె చుట్టూ ఉన్న మానిటర్లు అన్నింటిలోనూ గీతలు అడ్డంగా సరళరేఖల్లా వచ్చేశాయి. అంటే.. ఆమెకు కార్డియాక్ అరెస్ట్ అయిందని అర్థం. సోమవారం రాత్రి 11.30 గంటలకు జయలలిత మరణించినట్లు ప్రకటించారు. 'నన్ను ఆమె తమిళనాడు అసెంబ్లీకి కూడా తీసుకెళ్తానన్నారు' అంటూ షీలా గద్గద స్వరంతో చెప్పారు. -
రజనీతో సినిమాను జయలలిత వద్దన్నారా?
సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను కూడా మహారాణిలా బతికేసిన జయలలిత.. ఒకప్పుడు ఏకంగా రజనీకాంత్ సరసన చేసే అవకాశాన్ని వద్దనుకున్నారు! చేతులారా ఆ అవకాశాన్ని వదిలేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఒక లేఖలో తెలిపారు. తనపై ఒక పత్రికలోని 'ఖాస్ బాత్' అనే కాలమ్‌లో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాసిన ఈ లేఖలో.. ఆమె ఆ వివరాలన్నింటినీ తెలిపారు. ఆ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన బ్రయాన్ లాల్ మరోసారి తన ఫేస్బుక్ ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. ''అప్పటికి ఆమె అమ్మ కాదు, పురచ్చి తలైవి కాదు, లేదా ముఖ్యమంత్రి కూడా కాదు. బ్రహ్మాండమైన వ్యక్తిత్వం ఉండి, తన సొంత కాళ్ల మీద నిలబడి ఎదిగిన ఒక కళాత్మకమైన 32 సంవత్సరాల మహిళ మాత్రమే'' అని ఆయన తెలిపారు. అప్పట్లో పయస్జీ అనే పాత్రికేయుడిని ఉద్దేశిస్తూ ఘాటుగా ఆమె లేఖ రాశారు. అప్పట్లో ఖాస్బాత్ కాలమ్‌లో.. జయలలిత మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, కానీ అదే సమయంలో రజనీకాంత్ సరసన చేయాల్సిన సినిమాను వద్దనుకున్నారని రాశారు. దాన్ని ఖండిస్తూనే జయలలిత లేఖ రాశారు. ''ప్రముఖ నిర్మాత బాలాజీ నన్ను బిల్లా సినిమా కోసం సంప్రదించారు. ఆ చిత్రంలో కథానాయిక పాత్ర చేయాల్సిందిగా ముందు నన్ను అడిగారు. అది కూడా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ పక్కన. నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాతే బాలాజీ ఆ పాత్రకు శ్రీప్రియను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బాలాజీ స్వయంగా ప్రకటించారు. ఇంతమంచి ఆఫర్లు వదిలేసుకున్న నేను నిజంగా సినిమాల్లోకి మరోసారి వచ్చేందుకు కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నానా? నాకు ఆ అవసరమే లేదు. ఇక సినిమా రంగంలో చేయడం మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు'' అని ఆ లేఖలో జయలలిత పేర్కొన్నారు. ''సినిమా గాసిప్ కాలమ్‌లు రాసేటప్పుడు చదివేవాళ్లను దృష్టిలో ఉంచుకుంటారు. చదివేవాల్లు నవ్వుకోవాలని, ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవాలని అనుకుంటారు. కానీ, 1980లలో జయలలితకు సంబంధించిన ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరి దృష్టికీ వెళ్లింది'' అని లాల్ తన పోస్టులో పేర్కొన్నారు. ఫేస్బుక్లో ఆయన చేసిన ఈ పోస్టింగుకు విపరీతంగా షేర్లు, లెక్కలేనన్ని కామెంట్లు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే వాళ్ల సంభాషణలను నేరుగా విన్నట్లు అనిపిస్తోందని ఒక కామెంటులో పేర్కొన్నారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో మరణించిన జయలలిత (68) మృతదేహానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లి నివాళులు అర్పించారు. -
కరుణ.. జయ.. కలిసి పనిచేశారా?
తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి గట్టి ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి ఏ క్షణంలోనూ పడేది కాదు. అలాంటిది ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం అసలు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఉంటుందా? జయలలిత దాదాపు 140కి పైగా సినిమాల్లో నటించారు. 1960ల నుంచి 1980ల వరకు ఆమె తమిళ తెరను తిరుగులేకుండా ఏలిన రారాణి. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమే కాకుండా.. తమిళ రాజకీయాల్లో ఉన్న మరికొందరు ప్రముఖ నాయకులకు కూడా సినీ పరిశ్రమతో సంబంధం, అనుబంధం ఉన్నాయి. డీఎంకే అధినేత ఎం. కరుణానిధి.. అన్నాడీఎంకే అధినేత్రికి గట్టి ప్రత్యర్థి. కానీ ఆయన కూడా రాజకీయాల్లోకి రాకముందు పేరుమోసిన సినిమా రచయిత. అందుకే వీళ్లిద్దరూ కలిసి ఏమైనా సినిమాలో పనిచేశారా అన్న విషయం ఆసక్తికరంగానే ఉంటుంది. అవును.. ఒకే ఒక్క మాత్రం సినిమాకు ఇద్దరూ పనిచేశారు. జయలలిత తమిళంలో చేసిన తొలి సినిమా వెన్నిరాడై (1965). అప్పటికి తమిళ సినీ పరిశ్రమలో కరుణానిధి చాలా విజయవంతమైన స్క్రిప్టు రచయిత. ఆయనతో రాయించుకోవాలని దర్శకులు, నిర్మాతలు వెంటపడుతుండేవారు. కానీ, జయలలిత నటిగా ఎదిగే సమయానికి ఆయన సినిమాలకు రాయడం దాదాపు మానేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు. కానీ, 1966 సంవత్సరంలో ఎస్.రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మణి మకుటం సినిమా మాత్రం వీళ్లిద్దరినీ కలిపింది. ఆ సినిమాలో జయలలిత సెకండ్ హీరోయిన్గా చేశారు. ఆ సినిమాకు కరుణానిధి స్క్రిప్టు అందించారు. రాజకీయాల్లో ఇద్దరూ భీకరంగా తలపడినా, సినిమా రంగంలో మాత్రం ఒక్కసారి ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం లభించింది. కరుణానిధి సృష్టించిన పాత్రను జయలలిత పోషించారు. -
అమ్మ.. ముగ్గురు తెలుగు గవర్నర్లు!
తమిళ రాజకీయాలకు, తెలుగువారికి చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా జయలలిత రాజకీయ జీవితంతో కూడా తెలుగు నేతలకు విడదీయరాని బంధం ఉంది. తొలిసారి జయలలిత తమిళనాడుకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికి అప్పటి తమిళనాడు గవర్నర్‌గా మర్రి చెన్నారెడ్డి ఉండేవారు. అయితే, వాళ్లిద్దరికీ అసలు పడేది కాదంటారు. చెన్నారెడ్డి తన అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటే.. జయలలిత మాత్రం ఆయనను ఎప్పటికప్పుడు తగ్గించాలని చూసేవారు. ఆ తర్వాత.. మరోసారి జయలలిత సీఎం అయినప్పుడు రోశయ్య తమిళనాడు గవర్నర్ అయ్యారు. ఆయనే జయలలితతో ముఖ్యమంత్రిగా మే నెలలో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే.. ఆయనకు మాత్రం జయలలితతో సత్సంబంధాలుండేవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్య వైదొలగిన తర్వాత ఆయనకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు గవర్నర్ గిరీ కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇక చివరగా జయలలిత మరణించే సమయానికి కూడా తెలుగు వ్యక్తి.. సీహెచ్ విద్యాసాగర్ రావు గవర్నర్‌గా ఉన్నారు. ఆయన మహారాష్ట్రతో పాటు తమిళనాడు అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. జయలలిత ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే ఆయన హుటాహుటిన ముంబై నుంచి చెన్నైకి ఆదివారమే వెళ్లారు. ఈ ముగ్గురూ కాక, జయలలితతో మంచి అనుబంధం ఉన్న మరో తెలుగు రాజకీయ నాయకుడు.. దివంగత ఎన్టీ రామారావు. వీళ్లిద్దరూ కలిసి దాదాపు డజనుకు పైగా చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి జయలలిత వచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్ బాబు, కృష్ణ తదితర హీరోలతోనూ జయలలిత సినిమాల్లో నటించారు. -
రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కడసారి నివాళులు అర్పించేందుకు చెన్నై బయల్దేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే ఆ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి బయల్దేరారు. కానీ, కాసేపటి తర్వాతే ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆ విమానాన్ని తక్షణం వెనక్కి మళ్లించి ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు. దాంతో రాష్ట్రపతి ఇక జయలలితకు ప్రత్యక్షంగా నివాళులు అర్పించే వీలు ఉంటుందో లేదో అన్నది అనుమానంగానే మిగిలింది. -
ఘనంగా నివాళులు అర్పించిన పార్లమెంటు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పార్లమెంటు ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ముందుగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన సమావేశమైన రాజ్యసభలో.. జయలలిత నాయకత్వ పటిమను ప్రశంసించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆమెకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అన్సారీ ప్రకటించారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన లోక్‌సభ సమావేశమైంది. అక్కడ కూడా జయలలిత గుణగణాలను ప్రస్తావించిన తర్వాత ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత జయలలితకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు పలువురు ఎంపీలు పార్లమెంటు వెలుపల కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత చూపిన నాయకత్వ పటిమ అపూర్వమని, మహిళగా అనేక సవాళ్లు ఎదుర్కొని కూడా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు కూడా అమ్మను తలుచుకుని కళ్ల నీళ్లు పెట్టారు. -
జయలలిత మృతికి పార్లమెంటు నివాళి
-
ఆమెకు ఇక తోడెవరు?
అమ్మ అధికారంలో ఉన్నా.. జైల్లో ఉన్నా.. చివరకు ఆస్పత్రిలో అచేతన స్థితిలో ఉన్నా కూడా నిరంతరం ఆమె వెన్నంటి ఉన్న ఏకైక వ్యక్తి.. శశికళా నటరాజన్. జయలలితకు ఏకైక స్నేహితురాలు. ప్రపంచంలో ఎవరినీ అస్సలు నమ్మని జయలలిత... దాదాపు నిరంతరం నమ్మిన ఏకైక వ్యక్తి శశికళే. మధ్యలో కొన్నాళ్లు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి దూరమైనా, అనతికాలంలోనే మళ్లీ దగ్గరయ్యారు. వీళ్లిద్దరిది విడదీయలేని బంధం. వాస్తవానికి ఇద్దరూ ఎప్పటినుంచి కలిశారన్న విషయం తెలియదు గానీ, తొలిసారిప్రపంచానికి తెలిసింది మాత్రం 1991లోనే. మొదట్లో శశికళ వీడియో క్యాసెట్ల దుకాణం నడిపేవారు. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ ప్రచార క్యాసెట్లను శశికళ తీసుకొచ్చి జయలలితకు ఇచ్చేవారు. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. కలెక్టర్ చంద్రలేఖ.. జయలలితకు శశికళను పరిచయం చేశారు. అయితే ఒక పట్టాన ఎవరినీ నమ్మని జయలలిత.. ఈ శశికళను మాత్రం ఎలా నమ్మారన్నది అంతుపట్టని విషయం. శశికళ సాధారణంగా అవతలి వాళ్లు మాట్లాడుతుంటే మౌనంగా వింటారే తప్ప మధ్యలో కల్పించుకోరు. అలాగే ప్రచారవ్యూహాలు రచించడంలో కూడా దిట్ట అంటారు. 1991లో తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. పోయెస్‌గార్డెన్‌లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయ దత్తత తీసుకున్నారు. 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయ సీఎం కాలేకపోయారు. అపుడు పన్నీర్‌సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళే. ఎందుకంటే, ఆయన ఈమెకు కూడా విధేయుడు. ఆ తర్వాత.. 2002లో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. అప్పట్లో శశిని సీఎం చేయాలనుకున్నా.. వీలుపడలేదు. తర్వాత జయలలిత నిర్దోషిగా బయటపడుతూనే శశికళకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. పార్టీలో కీలక స్థానం కట్టబెట్టారు. 2011 ఎన్నికల్లో శశికళ ప్రాబల్యం బాగా పెరిగింది. చాలాకాలం ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి. ఇద్దరూ అచ్చం కవలపిల్లల్లాగే కనిపించేవాళ్లు. 2011 డిసెంబర్ 19న శశికళా నటరాజన్‌ను పార్టీ నుంచే కాకుండా, తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి కూడా జయలలిత బయటకు పంపేశారు. కానీ ఆ విభేదాలు ఎన్నాళ్లో లేవు. నాలుగు నెలల్లోపే ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు. ఎంతగానంటే.. చివరకు చెన్నై అపోలో ఆస్పత్రిలో వీవీఐపీలు, కేంద్ర మంత్రులు సైతం జయలలిత ఎలా ఉన్నారో చూడలేకపోయినా, శశికళ మాత్రం ఆమె పక్కనే ఉన్నారు. చిట్ట చివరి నిమిషం వరకు సైతం ఆమె తోడుగానే నిలిచారు. ఇప్పుడు జయ లేని లోటును శశికళకు ఎవరు తీరుస్తారో!