శశికళపై తిరుగుబాటు?
తమిళ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రిగా శశికళకు ఎంతవరకు ఆమోదం లభిస్తుందనేది అనుమానంగానే ఉంది. ఎంజీఆర్ కాలం నుంచి పార్టీలో సీనియర్ నాయకుడిగాను.. ఎంజీఆర్, జయలలిత ఇద్దరి వద్దా మంత్రిగాను పనిచేసిన సీనియర్ నాయకుడు పొన్నయన్ వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. పార్టీ నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. జయలలిత నేతృత్వంలో పార్టీ సమష్టిగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా అంతా కలిసికట్టుగానే ముందుకు సాగుతామని ఆయన అన్నారు. తమిళ ప్రజలకు సేవచేసే వ్యక్తే పార్టీ చీఫ్‌గా ఉంటారని స్పష్టం చేశారు. అయితే ఈ పోస్టును ఇప్పటికిప్పుడే భర్తీ చేయడానికి ఎన్నికలు లేవని తెలిపారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ ఎవరూ లేరని ఆయన చెబుతున్నా.. ఎక్కడా శశికళకు మద్దతిస్తున్నట్లు మాత్రం ఆయన చెప్పలేదు. పార్టీలో కుమ్ములాటలు ఏమీ లేవని అన్నారు. పార్టీలో మిలటరీ క్రమశిక్షణను అమ్మ నెలకొల్పారని, అది ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.
రెండు మంత్రివర్గాల్లోనూ పనిచేసిన పొన్నయన్ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆయనకు పార్టీలో మంచి స్థానం కల్పించారు. ఎంజీఆర్ కాలం నుంచి ఉన్న నాయకుల్లో పొన్నయన్, సెంగొటయన్, తంబిదురై, రామచంద్రన్ ముఖ్యులు. వీళ్లంతా కూడా ఇప్పుడు శశికళను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. మొదట్లో ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితకు మద్దతిచ్చిన వాళ్లంతా ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా ఉన్నారు. మన్నార్‌గుడి మాఫియా (శశికళ కోటరీ)కు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారపగ్గాలు అప్పగించేది లేదని అంతర్గత సంభాషణల్లో చెబుతున్నట్లు తెలిసింది. జయలలిత ఉన్నకాలంలో కూడా ఆమె వద్దకు వెళ్లాలంటే ముందుగా చిన్నమ్మ (శశికళ) పర్మిషన్ ఉండాల్సిందే అనేవారు. దాంతో తీవ్ర అవమానానికి గురైన సీనియర్లు.. ఇప్పుడు ఆమెను పార్టీ అధినేత్రిగా ఎంతవరకు అంగీకరిస్తారన్నది అనుమానమే. మరోవైపు శశికళకు ఎడపాటి పళనిస్వామి, దినకరన్ లాంటి కొంతమంది మాత్రం మద్దతిస్తున్నారు. వీళ్లు ప్రభావం చూపించే అవకాశం లేకపోయినా, తమవంతు ప్రయత్నం మాత్రం చేస్తున్నారు.