అమ్మ మృతిపై అనుమానాలు: ప్రధానికి లేఖ
అమ్మ మృతిపై అనుమానాలు: ప్రధానికి లేఖ
Published Fri, Dec 9 2016 9:07 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM
సుదీర్ఘ కాలం పాటు కమల్‌హాసన్‌తో సహజీవనం చేసి, ఇటీవలే విడిపోయిన ప్రముఖ నటి గౌతమి.. జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ కూడా రాశారు. జయలలిత ఆస్పత్రి పాలు కావడం, అక్కడ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పడం, అంతలోనే ఉన్నట్టుండి మృతి చెందారనడం.. వీటన్నింటిపైనా ఆమె ప్రధానికి రాశారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం అన్ని విషయాలనూ కప్పిపెట్టి ఉంచారని, ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎంత వీఐపీ, వీవీఐపీ వచ్చినా కూడా ఆమె ముఖాన్ని చూపించలేదని అన్నారు. అమ్మ ఆరోగ్యం పట్ల ఎంతో ఆందోళనతో వచ్చినవాళ్లంతా ఆమెను చూసే అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారని గౌతమి అన్నారు.
నిజానికి తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలువురికి జయలలిత ఆరోగ్యం, మృతి తదితర విషయాలపై అనుమానాలున్నా, ఎవరూ ఇలా బహిరంగంగా చెప్పలేదు. ఆమె మాత్రం నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇటీవలే ఒకసారి ప్రధాని మోదీని కూడా గౌతమి కలిసి వచ్చారు.
అందరికీ ప్రేమమూర్తి, తమిళనాడు ప్రభుత్వాధినేత్రి కూడా అయిన ఆమె ఆరోగ్యం విషయంలో ఇంత రహస్యం ఎందుకు పాటించాల్సి వచ్చిందని గౌతమి ప్రశ్నించారు. ఆమె వద్దకు వెళ్లకుండా నియంత్రించిన వాళ్లు ఎవరు, వాళ్లకున్న అధికారం ఏంటన్నారు. ఆమె ఆరోగ్యం చాలా పాడైనప్పుడు ఆమెకు అందించాల్సిన చికిత్సల గురించి నిర్ణయాలు తీసుకున్నవాళ్లు ఎవరని అడిగారు. ప్రజల మదిలో అలజడి రేపుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల గురించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందని గౌతమి తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటే కుదరదన్నారు. మోదీ తన ఆవేదనను పట్టించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Advertisement