ఘనంగా నివాళులు అర్పించిన పార్లమెంటు
Published Tue, Dec 6 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పార్లమెంటు ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ముందుగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన సమావేశమైన రాజ్యసభలో.. జయలలిత నాయకత్వ పటిమను ప్రశంసించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆమెకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అన్సారీ ప్రకటించారు.
అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన లోక్‌సభ సమావేశమైంది. అక్కడ కూడా జయలలిత గుణగణాలను ప్రస్తావించిన తర్వాత ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత జయలలితకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు పలువురు ఎంపీలు పార్లమెంటు వెలుపల కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత చూపిన నాయకత్వ పటిమ అపూర్వమని, మహిళగా అనేక సవాళ్లు ఎదుర్కొని కూడా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు కూడా అమ్మను తలుచుకుని కళ్ల నీళ్లు పెట్టారు.
Advertisement
Advertisement