పార్టీలో, ప్రభుత్వంలో మీరొద్దు: శశికళ
తన సమీప బంధువులలో ఏ ఒక్కరికీ కూడా ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ స్థానం లేదని శశికళ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్స్‌లో తన వాళ్లందరితో నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ఈ విషయం చెప్పినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులలో ఎవరైనా ఏం చెప్పినా అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రులు, పార్టీ కీలక నేతలందరికీ ఆమె చెప్పారంటున్నారు. ప్రస్తుతానికి శశికళ పోయెస్ గార్డెన్స్ నివాసంలోనే ఉంటారని సమాచారం. ప్రస్తుతానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారని, కానీ తర్వాత వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత ఆమె వదిన ఇళవరసి మాత్రం శశికళతో ఉంటారని చెబుతున్నారు.
జయలలిత మృతదేహాన్ని రాజాజీ హాల్లో ఉంచినప్పుడు అక్కడంతా శశికళ, ఆమె కుటుంబ సభ్యులే ఉన్నారని.. ఆమె మృతదేహం వద్దకు కొంతమంది వీఐపీలను తప్ప ఎవరినీ రానివ్వలేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. వాస్తవానికి 2011లో ఒకసారి శశికళ సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. తనపై కుట్రపన్నుతున్నారని అప్పట్లో ఆమె చెప్పారు. ఆ తర్వాత సుమారు నాలుగు నెలలకు మళ్లీ శశికళపై సస్పెన్షన్ ఎత్తేసి ఆమెను పార్టీలోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులను మాత్రం ప్యాలెస్‌లోకి అడుగుపెట్టనివ్వలేదు. మళ్లీ జయలలిత మరణం తర్వాతే శశికళ భర్త నటరాజన్ కూడా తెర మీదకు వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ తన బంధువులు పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ చక్రం తిప్పడం మొదలుపెడితే అది మరింత నెగెటివ్ ఫలితాలను తీసుకొస్తుందని శశికళ భావిస్తున్నారని, అందుకే తన బంధువులందరినీ దూరం పెడుతున్నారని అన్నాడీంఎకే వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం తర్వాతే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాల్సిందిగా అన్నాడీఎంకే నాయకులు కోరారని అంటున్నారు.
కొంతమంది ఆమెను ముఖ్యమంత్రి కూడా చేయాలనుకున్నారని, కానీ.. తాను మాత్రం ఎలాంటి పదవులు లేకుండానే ప్రజాసేవ చేయాలనుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, పార్టీలో ఎంతమంది ఏం చెప్పినా.. ప్రజామోదం ఎంతవరకు వస్తుందన్నదే శశికళ ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఆమె కుటుంబ సభ్యుల జోక్యం ఉంటుందని భయపడుతున్న కిందిస్థాయి కార్యకర్తల్లో ఎందరిని ఆమె సమాధానపరుస్తారన్నది కూడా అనుమానంగానే ఉంది. అసలు జయలలిత అంతిమయాత్ర సమయంలో తన కుటుంబ సభ్యులు జయ మృతదేహం పక్కనే ఉండేందుకు అనుమతించడం ద్వారానే శశికళ పెద్ద తప్పు చేశారని పార్టీ అగ్ర నాయకుడొకరు వ్యాఖ్యానించారు. జయలలిత మరణించి ఇప్పటికి ఐదు రోజులయినా... 'అమ్మ నుంచి చిన్నమ్మ'కు అధికార మార్పిడి ప్రక్రియ ఏమాత్రం జరగలేదని గుర్తుచేశారు.