రజనీతో సినిమాను జయలలిత వద్దన్నారా?
సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను కూడా మహారాణిలా బతికేసిన జయలలిత.. ఒకప్పుడు ఏకంగా రజనీకాంత్ సరసన చేసే అవకాశాన్ని వద్దనుకున్నారు! చేతులారా ఆ అవకాశాన్ని వదిలేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఒక లేఖలో తెలిపారు. తనపై ఒక పత్రికలోని 'ఖాస్ బాత్' అనే కాలమ్‌లో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాసిన ఈ లేఖలో.. ఆమె ఆ వివరాలన్నింటినీ తెలిపారు. ఆ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన బ్రయాన్ లాల్ మరోసారి తన ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. ''అప్పటికి ఆమె అమ్మ కాదు, పురచ్చి తలైవి కాదు, లేదా ముఖ్యమంత్రి కూడా కాదు. బ్రహ్మాండమైన వ్యక్తిత్వం ఉండి, తన సొంత కాళ్ల మీద నిలబడి ఎదిగిన ఒక కళాత్మకమైన 32 సంవత్సరాల మహిళ మాత్రమే'' అని ఆయన తెలిపారు. అప్పట్లో పయస్‌జీ అనే పాత్రికేయుడిని ఉద్దేశిస్తూ ఘాటుగా ఆమె లేఖ రాశారు. అప్పట్లో ఖాస్‌బాత్ కాలమ్‌లో.. జయలలిత మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, కానీ అదే సమయంలో రజనీకాంత్ సరసన చేయాల్సిన సినిమాను వద్దనుకున్నారని రాశారు. దాన్ని ఖండిస్తూనే జయలలిత లేఖ రాశారు.
''ప్రముఖ నిర్మాత బాలాజీ నన్ను బిల్లా సినిమా కోసం సంప్రదించారు. ఆ చిత్రంలో కథానాయిక పాత్ర చేయాల్సిందిగా ముందు నన్ను అడిగారు. అది కూడా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ పక్కన. నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాతే బాలాజీ ఆ పాత్రకు శ్రీప్రియను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బాలాజీ స్వయంగా ప్రకటించారు. ఇంతమంచి ఆఫర్లు వదిలేసుకున్న నేను నిజంగా సినిమాల్లోకి మరోసారి వచ్చేందుకు కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నానా? నాకు ఆ అవసరమే లేదు. ఇక సినిమా రంగంలో చేయడం మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు'' అని ఆ లేఖలో జయలలిత పేర్కొన్నారు.
''సినిమా గాసిప్ కాలమ్‌లు రాసేటప్పుడు చదివేవాళ్లను దృష్టిలో ఉంచుకుంటారు. చదివేవాల్లు నవ్వుకోవాలని, ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవాలని అనుకుంటారు. కానీ, 1980లలో జయలలితకు సంబంధించిన ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరి దృష్టికీ వెళ్లింది'' అని లాల్ తన పోస్టులో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన ఈ పోస్టింగుకు విపరీతంగా షేర్లు, లెక్కలేనన్ని కామెంట్లు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే వాళ్ల సంభాషణలను నేరుగా విన్నట్లు అనిపిస్తోందని ఒక కామెంటులో పేర్కొన్నారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో మరణించిన జయలలిత (68) మృతదేహానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లి నివాళులు అర్పించారు.