
అవన్నీ ఊహాగానాలే: నటి గౌతమి
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెరవేర్చారని నటి గౌతమి అన్నారు.
చెన్నై: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెరవేర్చారని నటి గౌతమి అన్నారు. ఆమె బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ... జయలలిత మరణం తర్వాత ఆమె ప్రవేశపెట్టిన పథకాల అమల్లో స్పష్టత లేదన్నారు. తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు యోగా చాలా ఉపయోగపడిందని గౌతమి తెలిపారు.
అలాగే రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తాను స్పందించనని, అవన్నీ ఊహాగానాలే అని ఆమె కొట్టిపారేశారు. దినకరన్ వివాదంపై ప్రజలకు అంతా తెలుసు అని గౌతమి అన్నారు. కాగా జయలలిత చికిత్స, మరణంపై సందేహాలు వ్యక్తం చేసిన గౌతమి ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం రెండు సార్లు లేఖలు రాసిన విషయం విదితమే.
మరోవైపు దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటంపై తమిళనాట చర్చ ఊపందుకుని ఉన్న విషయం తెలిసిందే. కథానాయకుడు రాజకీయంగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అమ్మ జయలలిత మరణం తదుపరి తమిళనాట నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రజనీ రాకకు ఇదే మంచి తరుణం అని ఆహ్వానించే వాళ్లు కొందరు అయితే, వ్యతిరేకించే వాళ్లూ అదే స్థాయిలో ఉన్నారు.