
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన కూడా స్కామ్‌లతో పాటు మోసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ఛాన్స్‌ల పేరుతో కొందరు చేస్తున్న మోసాలకు చాలామంది బలి అవుతున్నారు. ఇదే విషయాన్ని మలయాళ నటి షైనీ సారా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని కొందరు మోసానికి పాల్పడినట్లు ఆమె గుర్తుచేసుకుంది. ఆయనకు సతీమణిగా నటించే అవకాశం ఉన్నట్లు తనను ఒక టీమ్ నమ్మించేందుకు ప్లాన్ చేసిందని ఆమె తెలిపింది.
జైలర్ చిత్రంలో రజనీకాంత్ భార్య పాత్ర కోసం తనను ఎంపిక చేసినట్లు వాట్సాప్‌లో ఒక మేసేజ్ వచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ మెసేజ్ చూసిన తర్వాత తాను మొదట నమ్మానని షైనీ సారా వివరించింది. తరువాత, ఆమె వద్ద నటుల సంఘం సభ్యత్వ కార్డు ఉందా అని వారు అడగడంతో .. అవేవీ లేవని చెప్పినట్లు తెలిపింది. అయతే, ఆ స్కామర్ ఆ సభ్యత్వం తానే ఏర్పాటు చేస్తానని ముందుకొచ్చాడంటూ ఆమె ఇలా చెప్పింది. 'రెండు రోజుల తర్వాత సురేష్ కుమార్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. చీర ధరించి వీడియో కాల్‌లోకి రావాలని కోరాడు. కాల్ తర్వాత, నేను ఎంపికి అయ్యానని చెప్పారు.
కానీ, సభ్యత్వ కార్డు కోసం రూ. 12,500 చెల్లించమని అడిగారు. అనుమానం వచ్చి, నేను ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో కనీసం కొంత మొత్తాన్ని అయినా సరే పంపమని కోరారు. అప్పుడు నా సందేహాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఆ తర్వాత నా తోటి నటులను సంప్రదించాను. నటనకు సభ్యత్వం తప్పనిసరి కాదని వారు నిర్ధారించారు. దీంతో మళ్లీ ఆ వ్యక్తిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. సినీ పరిశ్రమలో ఇలాంటి మోసాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇతరులను హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment