అది రజనీకాంత్ వల్లే సాధ్యం...
చెన్నై: నాయకుడిగా ప్రజలు పిలుస్తున్నారు. కార్యకర్తలు అండగా ఉంటామన్నారు. ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరు? వారి ఆహ్వానం ఎవరికీ అన్న ఆసక్తి నెలకొనవచ్చు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ పరిణామాలు రంగులు మారుతున్నాయి. జయలలిత మరణం తరువాత తమిళనాడు ప్రభుత్వ పగ్గాలు ఎవరు చేపట్టాలన్న విషయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత మరణం అనంతరం ఆమె అనుంగుడు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత నెచ్చెలి శశికళను అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ముఖ్య నేతల్లో కొందరు వత్తిడి తెస్తున్నారు. అయితే ఆమె ప్రధాన కార్యదర్శి కావడం కార్యకర్తల్లో చాలా మందికి మింగుడు పడడంలేదు. ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చి రాజకీయవర్గాల్లో కలకలం పుట్టిస్తోంది. దీనికి కారణం సూపర్‌స్టార్ అభిమానులే. వారు తమ తలైవర్ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు.
కాగా తాజాగా తమిళనాట నెలకొన్న పరిణామాల దృష్ట్యా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని, అందుకు ఇదే సరైన తరుణం అని ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నై, తిరుచ్చి తదితర ప్రాంతాల్లో రజనీకాంత్ ఫొటోలతో కూడిన పోస్టర్లను అంటించారు. అందులో తలైవా నాయకత్వం కోసం ప్రజలు పిలుస్తున్నారు. కార్యకర్తలు అండగా ఉన్నారు. అన్న వ్యాఖ్యలు సంతరించుకున్నాయి. అంతే కాదు తమిళనాట ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి. అందుకు సమర్ధుడైన నాయకుడు కావాలి. అది రజనీకాంత్ వల్లే సాధ్యం. తమిళనాడులో అవినీతి పెరిగిపోయింది. అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. వాటిని అంతమొందించాలంటే రజనీకాంత్ వల్లే సాధ్యం. అని ఆయన అభిమానులు పేర్కొన్నారు.
అంతే కాదు రాష్టంలోని రజనీకాంత్ అభిమానులు త్వరలో ఆయన్ను కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. మరి ఇప్పటివరకూ మౌనంగా ఉన్న మన సూపర్‌స్టార్ అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? వేచి చూడాల్సిందే.