రజనీ రాజకీయాలపై నేతలు ఏమన్నారు?
''యుద్ధం వచ్చినపుడు చెబుతా.. సిద్ధంగా ఉండండి''... ఇదీ తన అభిమానులకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సందేశం. అంటే, తాను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు చెబుతానని, అందుకు ఇప్పటినుంచే మానసికంగా రెడీగా ఉండాలని పరోక్షంగా చెప్పినట్లేనని అంతా భావిస్తున్నారు. అయితే ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా మరే పార్టీ వచ్చినా అది మఖలో పుట్టి పుబ్బలో పోయినట్లే అవుతోందన్నది చరిత్ర చెబుతున్న నిజం. మరి రజనీకాంత్ చరిత్రను తిరగరాస్తాడా.. సొంతంగా పార్టీ పెడతాడా లేదా ఇప్పటికే ఉన్న ఏవైనా పార్టీలో చేరుతారా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై తమిళ రాజకీయ వర్గాలలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రజనీకాంత్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అన్నారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చేసినట్లే ఆయన మాట్లాడారు.
అయితే కేంద్ర మాజీమంత్రి, పీఎంకే నాయకుడు డాక్టర్ అన్బుమణి రాందాస్‌కు మాత్రం రజనీ రాజకీయాలు పెద్దగా నచ్చినట్లు లేవు. రజనీకాంత్ మంచివాడేనని, ఆ విషయం అందరికీ తెలుసని చెబుతూనే... తమిళ రాజకీయాలకు ఇప్పుడు డాక్టర్ కావాలి గానీ యాక్టర్ అక్కర్లేదన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఐసీయూలో ఉందని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా వైద్యుడిని కావడంతో.. ఆయనిలా స్పందించారని అనుకుంటున్నారు. యాక్టర్లు రాష్ట్రాన్ని 50 ఏళ్ల పాటు నాశనం చేశారని, అది ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు అందరూ అలాగే చేశారని అన్నారు. కేవలం నటనా నైపుణ్యాలు మాత్రమే రాష్ట్రానికి సరిపోవన్న విషయం యువతకు బాగా తెలుసని ఆయన చెప్పారు.
బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యంస్వామి కూడా రజనీ విషయంలో నెగెటివ్‌గానే స్పందించారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఆయన ఈరోజు ఒకమాట చెబితే రేపు మరోమాట చెబుతారని, ఎల్‌టీటీఈ బెదిరింపుల కారణంగా ఆయన ఎప్పటికప్పుడు తన మనసు మార్చుకుంటారని స్వామి ఆరోపించారు.
ఇప్పటికే ఉన్న నాయకులను ప్రశంసిస్తూనే.. వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పడం ద్వారా తాను రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్న విషయాన్ని రజనీ చెప్పకనే చెప్పినట్లయింది. ''మనకు స్టాలిన్, అన్బుమణి రాందాస్, సీమన్ లాంటి మంచి నాయకులున్నారు. కానీ, వ్యవస్థ పాడైనప్పుడు, ప్రజాస్వామ్యం కుప్పకూలినప్పుడు వాళ్లేం చేస్తారు? వ్యవస్థను మార్చాలి. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. నాకు నా వృత్తి ఉంది, మీకు మీ ఉద్యోగాలున్నాయి. మీరు వెళ్లి మీ ఉద్యోగాలు చేసుకోండి. సమరానికి సమయం ఆసన్నమైనప్పుడు మనం తిరిగి కలుద్దాం'' అని 67 ఏళ్ల సూపర్ స్టార్ తన అభిమానులతో అన్నారు. తాను తమిళుడిని కానన్న విమర్శలను ఆయన దీటుగా తిప్పికొట్టారు. తాను 23 ఏళ్లు కర్ణాటకలో ఉంటే 43 ఏళ్లుగా తమిళనాడులోనే ఉన్నానని చెప్పారు. ''కర్ణాటక నుంచి వచ్చిన మరాఠీని అయినా, మీరంతా కలిసి నన్ను మలిచారు, నన్ను అసలైన తమిళుడిగా మార్చారు'' అని అన్నారు.