
ఫ్యాన్స్ మీట్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్
చెన్నై : రజనీకాంత్ అనే పేరును తలుచుకుంటూ, ఒక్కసారి ఆయన్ను కలిస్తే చాలూ అనుకునే అభిమానులకు లెక్కేలేదు. అలాంటి రజనీ రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులకు మరికొద్ది గంటల్లో రానున్న నూతన సంవత్సరం ఇప్పటికే వచ్చేసినట్లు అయింది. బస్సు కండక్టర్ స్థాయి నుంచి రాజకీయ పార్టీ స్థాపనపై ప్రకటన వరకూ రజనీ జీవితం అనన్య సామాన్యం.
67 ఏళ్ల రజనీకాంత్ రాజకీయ రంగం ప్రవేశంపై కొద్ది నెలలుగా చర్చ కొనసాగింది. దీనిపై పలుమార్లు మాట్లాడిన ఆయన రాజకీయాలు భ్రష్టు పట్టాయని.. అందులోకి దిగాలంటే భయమేస్తోందని అన్నారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంబనకు ఆదివారం ఫ్యాన్స్ మీట్‌లో తెరదించారు రజనీ. త్వరలో పార్టీని స్థాపించి రాజకీయాల్లో బుడిబుడి అడుగులు వేస్తానని అన్నారు. తమిళనాడు వ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
బ్లాక్‌బస్టర్స్ అండ్ ఫ్లాప్స్
పలు రాజకీయ పార్టీల తరఫున గతంలో రజనీకాంత్ చేసిన ప్రచారం కొన్నిచోట్ల విజయం సాధించిపెట్టగా.. మరొకొద్ది చోట్ల ప్లాప్ షోగా మారింది. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-టీఎంసీ కూటమి గెలుపునకు కారణం రజనీకాంతే. ‘జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయితే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడు’ అనే స్టేట్‌మెంట్‌ను రజనీకాంత్ ఎన్నికల ప్రచారంలో వినియోగించారు.
ఆ తర్వాతి ఎన్నికల్లో డీఎంకే - బీజేపీ కూటమి తరఫు రజనీ మళ్లీ ప్రచారం చేసినా ఫలితాలు నిరాశకు గురి చేశాయి. 39 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే డీఎంకే - బీజేపీ కూటమి విజయం సాధించింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో పీఎంకేకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని రజనీ ప్రజలను కోరినా ఫలితం తలకిందులైంది. ఈ ఎన్నికల్లో పీఎంకే పోటీ చేసిన అన్నిచోట్లా గెలుపొందింది.
కష్టాల కలబోత..
రజనీకాంత్ జీవితం కష్టసుఖాల కలబోత. ఆయన మధ్యతరగతిలో కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. అయితే, బెంగుళూరులో నివాసం ఉండేవారు. రజనీకాంత్ తండ్రి శివాజీ రావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. రజనీకి ఐదేళ్లు వయసు ఉన్నప్పుడు తల్లి మరణించారు. అక్కడినుంచి రజనీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రెండు పూట్ల తిండి తినేందుకు కూడా ఆయన కుటుంబం మొత్తం శ్రమించాల్సి వచ్చేది.
యుక్తవయసు వచ్చాక రజనీ పలు ఉద్యోగాలు చేశారు. కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌లో బస్ కండక్టర్‌గా స్థిరపడ్డారు. బస్సులోని ప్రయాణీకులను అలరిస్తూ రోజు గడిపేసే వారు రజనీ. రజనీ టిక్కెట్లు ఇచ్చి, చిల్లర తిరిగిచ్చే స్టైల్‌ను చూసేందుకు ప్రయాణీకులు ఆయన బస్సు వచ్చే వరకూ బస్‌స్టేషన్‌లో ఎదురుచూసేవారు. 1973లో ఓ స్నేహితుడి నుంచి కొంత ఆర్థిక సాయం తీసుకున్న రజనీ.. మద్రాస్ ఫిల్మ్ మేకింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.
అదే సమయంలో రజనీ ఇచ్చిన ఓ రంగస్థల ప్రదర్శన డైరెక్టర్ కే బాలచందర్ కంట్లో పడింది. రజనీని కలిసిన బాలచందర్.. తమిళం నేర్చుకోమని సలహా ఇచ్చారు. అపూర్వ రాగాంగళ్ సినిమాలో కేన్సర్ పేషెంట్ పాత్రకు రజనీని ఎంపిక చేసుకున్నారు బాలచందర్. ఆ తర్వాత మరో సినిమాలో కూడా రజనీకి బాలచందర్ అవకాశం ఇచ్చారు. ఆ రెండు సినిమాలు భారీ హిట్ కావడంతో రజనీకాంత్ వెనక్కు తిరిగిచూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.