అభిమానోత్సాహం!
► తలైవా కోసం దూకుడు
► వార్డుల వారీగా సంఘాలు
► బలోపేతం లక్ష్యంగా అడుగులు
► యుద్ధ నినాదం
సాక్షి, చెన్నై : తలైవా రాజకీయాల్లోకి వస్తారన్న ఆశాభావంతో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించే పనిలోపడ్డారు. యుద్ధానికి సిద్ధం కావాలని రజనీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తాము సిద్ధం అన్న నినాదాన్ని అభిమానులు అందుకున్నారు. వార్డుల వారీగా సంఘాల ఏర్పాటులో దూసుకెళుతున్నారు. దేవుడు ఆదేశిస్తే... అంటూ 20 ఏళ్లుగా రాజకీయ ప్రవేశంపై దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ దాటవేత ధోరణితో ముందుకు సాగారు.
ప్రస్తుతం తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తలైవా తన అభిమానులతో భేటీ కావడం చర్చకు దారి తీసింది. అందులో ఆయ న ప్రసంగాలు ఆకర్షణీయంగా సాగాయి. రాజకీయాల్లోకి తలైవా వచ్చినట్టేనా అన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే, యుద్ధానికి సిద్ధం కండి అంటూ అభిమానులకు పిలుపు నిచ్చిన కథానాయకుడు, రాజకీయ ప్రవేశంపై మళ్లీ నాన్చుడు ధోరణిలో పడ్డారని చెప్పవచ్చు.
ప్రస్తుతం కాలా సినిమా మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఆ చిత్రం రాజకీయకోణంలో సాగే అవకాశాలు ఎక్కువేనన్న సంకేతాలతో హోరాహోరీ రాజకీయ అవతారం ఎత్తడం ఖాయం అన్న ధీమా అభిమానుల్లో పెరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజనీ అరంగేట్రం చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తుండగా, అదే స్థాయిలో వ్యతిరేకిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఎవ్వరు ఎలా విమర్శించుకున్నా, ఆహ్వానించుకున్నా తమకు పనిలేదని, తమ లక్ష్యం బలోపేతం అంటూ యుద్ధానికి సిద్ధం అన్న నినాదంతో అభిమానులు ముందుకు సాగే పనిలో పడ్డారు. కొన్ని జిల్లాల్లోని అభిమానులు రాజకీయ పక్షాల వలే వార్డు స్థాయిలో కమిటీల ఏర్పాటు, అభిమాన సంఘాల ఏర్పాటు మీద దృష్టి పెట్టి ఉండడం గమనార్హం. తాము అత్యుత్సాహం ప్రదర్శించడం లేదని, తలైవా ఎప్పుడు పిలుపునిచ్చినా అందుకు సిద్ధంగా ఉండే విధంగా ఇప్పుడే తమను తాము తయారు చేసుకుంటున్నామని కరూర్ అభిమాన సంఘం వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.
కరూర్‌లో ఆరు వందల వరకు అభిమాన సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం వార్డుల వారీగా సంఘాల ఏర్పాటుతో ఆ సంఖ్య పదిహేను వందలకు చేరి ఉండడం గమనార్హం. ఇదే విధంగా అన్నిజిల్లాల్లోనూ ఆయా అభిమాన సంఘాల నాయకులు వార్డు, మారు మూల గ్రామాల స్థాయిలో సంఘాల ఏర్పాటు మీద దృష్టి పెట్టడం ఆహ్వానించ దగ్గ విషయం. కింది స్థాయిలో బలంగా ఉన్నప్పుడే రాజకీయంగా ఎదిగేందుకు ఆస్కారం ఉందని, ఈ దృష్ట్యా, తమ నాయకుడు పార్టీని ప్రకటించినా, రాజకీయ ప్రవేశం చేసినా, తమ బలం తమది అన్నట్టుగా చాటుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ మొదలెట్టినట్టు మరి కొందరు నాయకులు పేర్కొంటుండడం గమనార్హం.
అయితే, తాము ఎవ్వరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అభిమాన సంఘాలు కొత్తగా ఏర్పాటు చేసినట్టుగా తమ దృష్టికి రాలేదని రజనీ కాంత్ రాష్ట్ర అభిమాన సంఘం కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అభిమానులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తు ముందుకు సాగుతున్నారేగానీ, అధికారికంగా వారికి ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వలేదని పేర్కొంటున్నారు.