సహజంగా ఆదివారం అంటే అందరికీ విలాసంగా విశ్రాంతి తీసుకునే దినం. కానీ ఈ ఆదివారం అందరికీ ఉత్కంఠ రేకెత్తించే రోజుగా మారిపోయింది. రాజకీయ ప్రవేశంపై ఈనెల 31వ తేదీన ఒక స్పష్టత ఇస్తానని నటుడు రజనీకాంత్ ప్రకటించిన కారణంగా దేశమంతా ఈ ఆదివారం ఆయనవైపు చూస్తోంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: రజనీకాంతే స్వయంగా చెప్పినట్లుగా 1996లోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయితే అవి ప్రత్యక్షరాజకీయాలు కావని అందరికీ తెలుసు. రాజకీయ పార్టీ పెట్టడమో లేదా మరేదైనా పార్టీలో చేరడమో జరుగుతుందని అభిమానులు ఇన్నాళ్లూ ఎదురుచూశారు. బీజేపీ పదేపదే రజనీని ఆహ్వానిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలపై ఇప్పటికే పదేపదే వాయిదా వేస్తూ వచ్చిన రజనీకాంత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో అభిమానులతో తొలివిడత సమావేశమైన రజనీకాంత్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. మరలా ఈనెల 26వ తేదీ నుంచి రెండో విడత సమావేశాలు నిర్వహిస్తూ అభిమానులను కలుస్తున్నారు.
తలైవా రాజకీయాల్లోకి రావా అని అభిమానుల నినాదాలకు స్పందించిన రజనీకాంత్... ఈనెల 31వ తేదీన ఒక ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టగా అడ్డుతగులుతూ ఒక ప్రకటన చేస్తానని మాత్రమే చెప్పాను అంటూ రెట్టించారు. రజనీకాంత్ మాటల వల్ల అభిమానుల్లో కొంత అనుమానాలు రేకెత్తాయి. ఇంతకూ 31వ తేదీన రజనీచేసే ప్రకటన ఏమిటని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడడం ప్రారంభించారు. శనివారం మీడియా ప్రశ్నించగా ఒక్క రోజు ఆగండి అంటూ నవ్వుతూ బదులిచ్చారు. అలాగే తమిళనాడులోనేగాక దేశమంతా రజనీ చేయబోయే ప్రకటన కోసం ఎదురుచూస్తోంది.
కష్టాలను, సవాళ్లను అధిగమించి..
అనేక కష్టాలను, సవాళ్లను అధిగమిస్తూ ఈ దశకు చేరుకున్నానని నటుడు రజనీకాంత్ శనివారం ఐదోరోజు అభిమానుల సమావేశంలో పేర్కొన్నారు. రజనీకాంత్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 1960లో నేను బెంగళూరులో ఉన్నపుడు పోలీసు, ప్రభుత్వం, చదువు, రవాణా సదుపాయాలు ఇలా అన్నింటికీ మద్రాసు ఆదర్శంగా ఉండేది. 1973లో చెన్నైకి చేరుకున్న మా అన్న కార్పొరేషన్‌లో మేస్త్రీ పనులు చేస్తూ నెల జీతంగా సంపాదించే రూ.70 సంపాదించేవాడు. దాని నుంచి రూ.35 నాకు పంపి చదివించాడు. నాకు మా అన్నే దైవం. ఈ తరువాత ప్రాణస్నేహితుడు రాజబహద్దూర్. నాలోని నటుడిని తొలిసారిగా గుర్తించింది అతనే. ఇంకా పలువురు స్నేహితులు ఒక కుటుంబ సభ్యుడిగా చేరదీశారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ముగిసిన తరువాత దర్శకులు బాలచందర్‌ను కలిస్తే నటించి చూపమన్నారు. ఆరోజుల్లో నాకు తమిళం తెలియదు, బెంగళూరు కార్పొరేషన్ స్కూళ్లలో చదువుకున్నందున ఇంగ్లిషు సరిగా రాదు.
ఈ విషయాన్ని బాలచందర్‌కు చెప్పగా ‘మీరంతా ఇన్‌స్టిట్యూట్‌లో ఏమి నేర్చుకున్నారనే అర్థంలో ఓరకంగా చూశారు. ఇక సినిమావేషాలు రావని నిర్ధారించుకున్నా. అయితే ఆశ్చర్యకరంగా మూడు సినిమాల్లో బుక్ చేసుకున్నట్లు తెలపడంతో ఆశ్చర్యపోయా. తమిళం బాగా నేర్చుకో నిన్ను మంచి నటుడిని చేస్తానని అన్నారు. ఆ తరువాత పంజు అరుణాచలం, మణిరత్నం, సురేష్ కృష్ణ నన్ను సూపర్‌స్టార్ చేశారు. దర్శకులు శంకర్ నాకు దేశస్థాయిలో గుర్తింపును తెచ్చారు. ఇలా కొనసాగిన నా సినీ జీవితంలో ప్రస్తుతం 2 ఓ, కాలా చిత్రాలకు చేరుకున్నా. 2 ఓ వంటి కంటెంట్ ఉన్న చిత్రం మరోటి వస్తుందా అన్నంత బాగా ఉంది.ఈ చిత్రం ఏప్రిల్ 4వ వారంలో విడుదల అవుతుంది. అలాగే కాలాలో కొత్త రజనీకాంత్‌ను చూస్తారు. ఈ రెండు చిత్రాల తరువాత నా జీవితం దేవుడి చేతిలో ఉంటుంది.
తీవ్ర అనారోగ్యంతో సింగపూరులో చికిత్స పొందుతున్నపుడు పునర్జన్మను ప్రసాదించింది మీరే (అభిమానులే). మీ ప్రార్థనలు, పూజలే నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాయి. మీకు సినిమాలు వద్దు, రాజకీయాలూ వద్దు మా కళ్లెదురుగా చివరి వరకు జీవించి ఉంటే చాలని ఒక అభిమాని రాసిన ఉత్తరం చదివి కదిలిపోయాను. జీవితంలో భవిష్యత్తు గురించి కనేకలలు నిజం కావాలి, ఒక వేళ కాకుంటే కలత చెందవద్దు, అలాగని కలలు కనడం మానివేయవద్దు. కలలు సాధించుకునేందుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వక్రమార్గాన్ని ఎన్నుకోవద్దు. అన్యాయమైన కలలు కనవద్దు. అక్రమమార్గంలో సాధించుకునే కలల వల్ల మనశ్శాంతి, పరువు ,మర్యాదలను కోల్పోతాం. ఉత్తర, దక్షిణ, మధ్య చెన్నై అభిమానులు హాజరై తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగారు. అన్నాడీఎంకే, డీఎంకే రాజకీయాల్లో ఉండకూడదు, రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి చురుకైన పాత్ర పోషించాలని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment