సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం!
సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం!
Published Mon, Feb 13 2017 9:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
తమిళనాడు రాజకీయాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పన్నీర్ సెల్వం.. తాను సోమవారం సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సచివాలయానికి వెళ్లడం ఇదే మొదటిసారి. సచివాలయంలో ఆయన ఏం చేస్తారన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియరావట్లేదు.
మరోవైపు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం కూడా సోమవారమే జరగనుంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని అంటున్నారు. దాంతో డీఎంకే సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఇంకోవైపు గవర్నర్ ఇప్పటికైనా నిర్ణయం తీసుకోని పక్షంలో తాను కేసు దాఖలు చేస్తానని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి హెచ్చరించారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునేదీ కూడా సోమవారమే తెలియనుంది. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల వాంగ్మూలాలపై మద్రాస్ హైకోర్టుకు పోలీసులు కూడా సోమవారం నివేదిక సమర్పించాల్సి ఉంది. శుక్ర, శనివారాల్లో పోలీసులు గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్పారన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో పోలీసులు కోర్టుకు తెలియజేయాల్సి ఉంది.
Advertisement