అమ్మ.. ముగ్గురు తెలుగు గవర్నర్లు!
తమిళ రాజకీయాలకు, తెలుగువారికి చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా జయలలిత రాజకీయ జీవితంతో కూడా తెలుగు నేతలకు విడదీయరాని బంధం ఉంది. తొలిసారి జయలలిత తమిళనాడుకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికి అప్పటి తమిళనాడు గవర్నర్‌గా మర్రి చెన్నారెడ్డి ఉండేవారు. అయితే, వాళ్లిద్దరికీ అసలు పడేది కాదంటారు. చెన్నారెడ్డి తన అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటే.. జయలలిత మాత్రం ఆయనను ఎప్పటికప్పుడు తగ్గించాలని చూసేవారు.
ఆ తర్వాత.. మరోసారి జయలలిత సీఎం అయినప్పుడు రోశయ్య తమిళనాడు గవర్నర్ అయ్యారు. ఆయనే జయలలితతో ముఖ్యమంత్రిగా మే నెలలో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే.. ఆయనకు మాత్రం జయలలితతో సత్సంబంధాలుండేవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్య వైదొలగిన తర్వాత ఆయనకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు గవర్నర్ గిరీ కట్టబెట్టిన విషయం తెలిసిందే.
ఇక చివరగా జయలలిత మరణించే సమయానికి కూడా తెలుగు వ్యక్తి.. సీహెచ్ విద్యాసాగర్ రావు గవర్నర్‌గా ఉన్నారు. ఆయన మహారాష్ట్రతో పాటు తమిళనాడు అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. జయలలిత ఆరోగ్యం విషమించిన విషయం తెలియగానే ఆయన హుటాహుటిన ముంబై నుంచి చెన్నైకి ఆదివారమే వెళ్లారు.
ఈ ముగ్గురూ కాక, జయలలితతో మంచి అనుబంధం ఉన్న మరో తెలుగు రాజకీయ నాయకుడు.. దివంగత ఎన్టీ రామారావు. వీళ్లిద్దరూ కలిసి దాదాపు డజనుకు పైగా చిత్రాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి జయలలిత వచ్చారు. ఎన్టీఆర్‌తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్ బాబు, కృష్ణ తదితర హీరోలతోనూ జయలలిత సినిమాల్లో నటించారు.