ఎదురు దెబ్బలు!
సాక్షి, ముంబై: పోలీసు కొలువుల భర్తీ సర్కారును ఇరకాటంలో పడేస్తోంది. భర్తీ ప్రక్రియలోభాగంగా ఐదు కిలోమీటర్ల పరుగు పరీక్షలో పాల్గొన్న నలుగురు యువకులు మృత్యువాత పడడంతో నియామక ప్రక్రియపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా అటువంటివేవీ నియామకం చేపడుతున్న ప్రదేశంలో కనిపించకపోవడంపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులందాయి. మరోవైపు పత్రికలు, మీడియాలో వస్తున్న కథనాలను ఆధారంగా చేసుకొని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేసును సుమోటోగా స్వీకరించింది.
సంబధిత అధికారులపై చర్య తీసుకోండి: సోమయ్య
భర్తీ ప్రక్రియ జరుగుతున్న స్థలాన్ని స్వయంగా పరిశీలించిన కేంద్రమంద్రి కిరీట్ సోమయ్య రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన పిటిషన్‌పై స్పందించిన కమిషన్ మరణాలపై దర్యాప్తు జరిపి మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మానవహక్కుల కమిషన్ చైర్మన్ ఎస్‌ఆర్ బన్నుర్‌మఠ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సంభవించిన నలుగురు అభ్యర్థుల మరణాలపై జూలై 8లోగా నివేదిక ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఇదిలావుండగా నియామక ప్రక్రియ చేపడుతున్న ప్రాంతాల్లో అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, షెల్టర్లు, ఆహారం వంటి కనీస సదుపాయాలు లేవని సోమయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతోనే పరుగు పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు సొమ్మసిల్లి పడిపోతున్నారని ఆయన ఆరోపించారు. అభ్యర్థుల మరణాలకు సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. అంతేకాక మృతిచెందిన అభ్యర్థుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు.
కనీస సదుపాయాలేవి?: హైకోర్టు
పోలీసు భర్తీ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అపశ్రుతులపై సోమవారం ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా కథనాల ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. ఈ ఘటనలపై ప్రభుత్వం, పోలీసుశాఖ సమాధానమివ్వాలని సూచించింది.
పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలి వచ్చే విషయం తెలిసి కూడా వారికి కనీస సదుపాయాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. అలాగే పోటీలు నిర్వహించేందుకు సరైన మైదానాలు ఎంపిక చేయలేదని, మండుటెండలో పరుగు పరీక్షలు నిర్వహించడంవల్ల నలుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కోర్టు మండిపడింది. దీనిపై ప్రభుత్వం, పోలీసు శాఖ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.