థానె: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రహదారులను సిమెంటు కాంక్రీట్ రహదారులుగా మార్చనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కాంక్రీట్ రోడ్లే ఎక్కువ కాలం మన్నికగా, స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ముంబైలో 20 ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంటు రహదారులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని చెప్పారు.
కానీ, కొందరు నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు సిమెంటు రోడ్ల నిర్మాణానికి సుముఖత చూపడంలేదని అన్నారు. నవీ ముంబైలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రవాసీ–2017 ఇండియా ఇంటర్నేషనల్ బస్, కార్ ట్రావెల్ షో ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని రహదారులను సిమెంటు రోడ్లుగా మారిస్తే, అవి తప్పకుండా 200 ఏళ్లు మన్నికగా ఉంటాయని చెప్పారు.