
‘కేంద్రం లెక్కల టీచర్ కోసం వెతుకుతోంది’
న్యూఢిల్లీ: గతేడాది కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లను ఇంకా లెక్కిస్తూనే ఉన్నామన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం మంచి లెక్కల టీచర్ కోసం వెతుకుతోందని..ఆసక్తి ఉన్నవారు వీలైనంత తొందరగా ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో) దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వేలాకోళం చేశారు.
‘పెద్ద నోట్లు రద్దయిన 8 నెలల తర్వాత ఆర్బీఐ నోట్ల లెక్కింపు యంత్రాలను కొనుగోలు చేస్తోంది. బహుశా ఇంతకుముందు లీజు అన్న పదాన్ని వారు వినలేదేమో’ అని మాజీ మంత్రి పి.చిదంబరం ట్వీట్ చేశారు. ముద్రా రుణాల ద్వారా 7.28 కోట్ల మంది యువత స్వయం ఉపాధి పొందారన్న అమిత్‌షా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘7.28 కోట్ల మంది యువతకు స్వయం ఉపాధి’ పేరుతో దేశంలో సరికొత్త పౌరాణిక నాటకం మొదలైందని ఎద్దేవా చేశారు. ఆసక్తి కలిగిన కథారచయితలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.