న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతోందనే ఆరోపణలపై దేశంలో ఒక్కసారిగా వేడి పుట్టింది. దీనిపై పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్ధాంతమే చేస్తోంది. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ ఆందోళన చేస్తోంది. ఈ రాద్ధాంతం వెనుక రాజకీయ ఉద్దేశమే లేదనుకుంటే నేడు ప్రభుత్వ నిఘా నేత్రం నుంచి మన దేశ పౌరుడెవరికీ వ్యక్తిగత స్వేచ్ఛ లేదనే వాస్తవాన్నీ ముందు వారు గుర్తించాలి. దీనికి బాధ్యులెవరో కాదు. సాక్షాత్తు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మనల్ని పరిపాలించిన ప్రభుత్వాలే. బ్రిటిష్ వలసపాలనా కాలం నుంచి నేటి 21వ శతాబ్దంలో కూడా దేశలోని ప్రజలందరిపైనా ప్రభుత్వ నిఘా వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. బ్రిటీష్ పాలకులు 1985లో తీసుకొచ్చిన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1998లో తీసుకొచ్చిన ఇండియన్ పోస్టాఫీస్ చట్టంలో భారత పౌరులపై నిఘావేసే అధికారం, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం ప్రభుత్వానికి, సంబంధిత ప్రభుత్వ విభాగాలకు కట్టబెట్టింది. ఆ తర్వాత భారత ప్రభుత్వాలు కొద్ది మార్పులతో తీసుకొచ్చిన చట్టాలు కూడా అలాగే ఉన్నాయి.
దేశ పౌరులపై నిఘా కొనసాగించేందుకు, వారు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సమాచారాన్ని, సన్నిహిత బాంధవ్యాన్ని వ్యక్తీకరించే సంభాషణల్నీ మనకు తెలియకుండా దొంగిలించే అధికారాన్ని నేటి ఇండియన్ యాక్ట్‌లోని ఆరవ సెక్షన్, టెలిగ్రాఫ్ చట్టంలోని 69(1) సెక్షన్‌లు ప్రభుత్వానికి కట్టబెట్టాయి. భారత సమగ్రత, సౌర్వభౌమాధికారం పేరిట ఈ అధికారాలకు కట్టబెడుతున్నట్టు చట్టంలో పేర్కొన్నప్పటికీ వాటికి సరైన నిర్వచనాలు లేవు. అందుకని అధికారంలోవున్న రాజకీయ పక్షం తలుచుకుంటే అకారణంగా కూడా ఎవరిపైనన్నా నిఘాను ఇష్టానుసారం కొనసాగించవచ్చు. నేటి ఆధునిక సాంకేతక, సమాచారం యుగంలో సమాచార నిఘా, తస్కరణలకు ఎప్పటికప్పుడు ఆధునిక నిఘా పరికరాల (టూల్స్)ను సేకరిస్తున్న భారత ప్రభుత్వం, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ (ప్రై వసీ) పరిరక్షణ చట్టాలను తీసుకరావడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ప్రైవసీ చట్టాలను తీసుకరావడంలో బ్రిటన్‌లాంటి అగ్రదేశాలే ముందున్నాయి.
రాహుల్ గాంధీపై కేంద్రం నిఘా వ్యవహారం గురించి పార్లమెంట్‌లోపల, బయట గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, అంటే యూపీఏ ప్రభుత్వం పదేళ్ల పాలనలోనే ప్రభుత్వ నిఘా వ్యవస్థ మరింత పదును తేరింది. కేంద్ర నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ 2011, జూలై నెలలో కేంద్ర పర్యవేక్షక వ్యవస్థ (సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్-సీఎమ్మెస్)ను యూపీఏ ప్రభుత్వ తీసుకొచ్చింది. ఎవరిపై నిఘాను కొనసాగిస్తున్నామో బయటకు పొక్కకుండా ఉండేందుకు, యాంత్రికంగా దానంతట అదే నిఘా సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్టు 2013, ఆగస్టు 23వ తేదీన అప్పటి టెలికామ్ సహాయ మంత్రి మిలింది దేవరా స్వయంగా రాజ్యసభకు తెలియజేశారు. రాడియా టేపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సీఎమ్మెస్‌ను తీసుకొచ్చిన విషయం ఇక్కడ గమనార్హం. దేశంలోని పౌరులపై ఇంటెలీజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(ఆర్ అండ్ డబ్ల్యూ), పరిమిత పరిధిలో సీబీఐ, ఐటీ విభాగాలు నిఘాను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా సామాజిక వెబ్‌సైట్లలో సమాచారాన్ని ఐబీ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. ఆధునిక నిఘా సౌకర్యాలుగల తూర్పు ఢిల్లీలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌వో) ఈ సంస్థలకు అవసరైమైన సాంకేతిక సమారాన్ని, పరికరాలను అందజేస్తుంది.
నిఘా సమాచారం కోసం ఒకప్పుడు ప్రవేటు ఐటీ కంపెనీలపై ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం తర్వాత తన పంథా మార్చుకొని సొంతంగా మెటా-డాటాకు శ్రీకారం చుట్టింది. (ఓ సమాచారానికి సంబంధించిన డాటాను సేకరించి మరోచోట నిక్షిప్తం చేయడాన్ని మెటా డాటాగా పేర్కొనవచ్చు) మెటా డాటా కోసం అవసరమైన నిఘా పరికరాలను భారత్ తొలుత, ఇజ్రాయెల్ సైనిక యూనిట్-8200లో పనిచేసి బయటకొచ్చి సొంతంగా ప్రై వేట్ కంపెనీ స్థాపించిన కోబి అటెగ్జాండర్ నుంచి కొనుగోలు చేసింది. ఆ తర్వాత బెంగుళూరుకు చెందిన ఓ ప్రై వేటు కంపెనీ నుంచి తమకు కావాల్సిన నిఘా పరికరాలను అభివద్ధి చేసుకొంది. అదే సరళిలో డీఆర్‌డీవో కూడా ‘నెట్రా’ పేరిట ఓ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఇంటెల్ కంపెనీ తయారు చేసిన నిఘా పరికరాలను, ఫిల్టర్స్‌ను ఉపయోగిస్తోంది. అంతర్జాతీయంగా అమెరికాలో జరిగిన 9బై11, దేశీయంగా ముంబైలో జరిగిన 26బై11 దాడులు నిఘా వ్యవస్థ పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని తీసుకరావచ్చుగాక, ప్రై వసీ చట్టాలను పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. భారత్‌లో అధికారంలోవున్న అప్పటి యూపీఏ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీయైన బీజేపీలపైనా అమెరికా నిఘా పెట్టిందన్న విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసినప్పుడు నాటి భారత ప్రభుత్వం ఎంతు నొచ్చుకుందో ఓ గుర్తుతెచ్చుకోవాలి.
పౌరులపై నిఘా పెంచిందీ కాంగ్రెస్ ప్రభుత్వమే
Published Tue, Mar 17 2015 5:44 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement