‘మరో ఫొటో కోసమే ఆ ఆరాటమంతా’
న్యూఢిల్లీ/మాందసౌర్: కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని రైతులు చేస్తున్న ఆందోళనలు మరింత రెచ్చగొడుతోందని, రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న హడావుడి అంతా కూడా ప్రచార తాపత్రయం, నలుగురికి కనిపించాలనే ఆర్భాటమేనని, మరో ఫొటోకోసమే ఆయన ఆవేశం అని విమర్శించారు. కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతున్న మాందసౌర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనలు తీవ్ర స్థాయిగా మారి ఈ ఘటనలో 5గురు రైతులు ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితులు మరింత చేజారాయి.
దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన పదవిలో నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేశారు. 1998 జనవరి 12న బీతుల్ జిల్లాలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ హయాంలో పోలీసుల కాల్పుల్లో 24మంది రైతులు చనిపోయారనే విషయం గుర్తు చేశారు.
ఆనాడు వారు దిగ్విజయ్ రాజీనామా కోరారా? అని ప్రశ్నించారు. నాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాధితుల కుటుంబాలను పరామర్శించారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బాధ్యతగల ఓ రాజకీయ పార్టీగా నడుచుకొని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మరింత రెచ్చగొట్టకుండా, రాజకీయం చేయకుండా ఉండాలని హితవు పలికారు.