గాంధీ కుటుంబాన్ని పక్కన పెట్టేస్తున్నారు
ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు గాంధీ కుటుంబాన్ని.. ముఖ్యంగా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బేణీప్రసాద్ వర్మ ఆరోపించారు. పార్టీలోనే ఉంటూ నాయకత్వాన్ని విమర్శిస్తున్న వాళ్లు ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నారన్నారు. అయితే ఏ ఒక్కరి పేరును ఆయన ప్రస్తావించలేదు. వాళ్ల పేర్లు, ముఖాలు అందరికీ తెలుసని మాత్రం చెప్పారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లే టికెట్లు అమ్ముకుని భారీగా సొమ్ము వెనకేసుకున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నారు.
ఇంతకుముందు రాహుల్ గాంధీని పొగిడినవాళ్లే ఇప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడం సత్సంప్రదాయం కాదని బేణీ ప్రసాద్ వర్మ చెప్పారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీయేనని, ఆయన మాత్రమే నరేంద్రమోడీని ఢీకొనగలరని అన్నారు. ఆయనకు రాజకీయాలు, సమాజం, ఆర్థికవ్యవస్థపై లోతైన పరిజ్ఞానం ఉందని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో వస్తుందని, పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి రాహుల్ త్వరలోనే చర్యలు తీసుకుంటారని బేణీ తెలిపారు.