జైపూర్ : అశోక్ గహ్లోత్ సారథ్యంలోని పాలక కాంగ్రెస్ సర్కార్‌పై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేల బేరసారాల వెనుక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధరా రాజె పాత్ర ఉందని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. బీజేపీ నేత సంజయ్ జైన్ ఎనిమిది నెలల కిందట తనను కలిసి వసుంధర రాజెతో పాటు ఇతరులను సంప్రదించాల్సిందిగా కోరాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా పేర్కొన్నారు. జైన్‌తో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా గహ్లోత్ సర్కార్‌ను కూల్చేందుకు ప్రయత్నించారని, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సంజయ్ జైన్ చాలాకాలంగా ఇదే పనిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై సంజయ్ జైన్‌ను రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు వసుంధర రాజే సాయపడుతున్నారని బీజేపీ మిత్రపక్షం నుంచి ఆరోపణలు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, వసుంధర రాజే తనకు సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ గహ్లోత్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని రాష్ర్టీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివల్ ట్వీట్ చేశారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు దూరంగా ఉండాలని సికర్, నగౌర్‌లకు చెందిన జాట్ ఎమ్మెల్యేలందరికీ వసుంధరా రాజే సూచిస్తున్నారని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాగా రాజస్తాన్‌లో పాలక కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షోభంలోకి బీజేపీ నేతలను ఎందుకు లాగుతున్నారని ఈ విమర్శలపై వసుంధర రాజే మండిపడ్డారు. ఇక తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా ఆయన వర్గానికి చెందిన 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్ధాన్ అసెంబ్లీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై పైలట్ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పైలట్‌ను తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. చదవండి : పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్..
Comments
Please login to add a commentAdd a comment