
మా పథకాలతో పేదలకు మేలు: సోనియ గాంధీ
రాయ్‌బరేలీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వ పథకాల జపం ప్రారంభించారు. ఆహార భద్రత, భూసేకరణ చట్టాలతో ప్రజల జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గం రాయ్‌బరేలీలో ఆమె మంగళవారం పర్యటించారు. లాల్‌గంజ్‌లో రైల్వే చక్రాల ప్లాంటుకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ‘రైతుల కోసం కేంద్రం చరిత్రాత్మక భూసేకరణ చట్టాన్ని తెచ్చింది. పేద రైతుల నుంచి ఇకపై ఎవరూ భూములు లాక్కోలేరు. రైతుల ఆమోదంతో, వారికి తగినంత పరిహారం చెల్లించాకే భూములు తీసుకోవాలి’ అని అన్నారు.
ఎన్నో అడ్డంకులు అధిగమించి ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చామని, దీని వల్ల యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం మందికి, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రైల్వే శాఖ, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లు లాల్‌గంజ్‌లో రైల్వే చక్రాల తయారీ పరిశ్రమ కోసం తొలిదశలో రూ.1,100 కోట్ల పెట్టుబడులు పెట్టనుండడం తెలిసిందే. కాగా, సోనియా రాయ్‌బరేలీలో.. యూపీలోనే తొలి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత సోనియా జిల్లా వ్యవసాయ శాస్త్ర కేంద్రానికి వెళ్లి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. గోరా బజర్‌కు వెళ్లి గ్రహణం మొర్రికి చికిత్స చేయించుకున్న రేణు అనే 17 ఏళ్ల బాలికను పరామర్శించారు.