స్నానాల లక్ష్మీపురంలో విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
వైరా/వైరా రూరల్: ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కోరామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణపై ప్రేమ ఉన్న ఏ పార్టీ కూడా సోనియాపై పోటీకి దిగవద్దని భట్టి సూచించారు. రాష్ట్రంలో గత తొమ్మిదేన్నరేళ్లలో పాలన గాడి తప్పిందని, దాన్ని తమ ప్రభుత్వం తిరిగి దారిలో పెడుతోందన్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు 21వ తేదీ తర్వాతే జీతాలు అందేవని, ఈనెల మొదటి వారంలోనే జీతాలు పొందేలా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకున్నామని తెలిపారు.
మిషన్ భగీరథలో అవినీతిని త్వరలో బయటపెడతాం
మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలపై నివేదిక తయారు చేస్తున్నామని, అందులోని అవినీతిని త్వరలోనే బయటపెడతామని భట్టి ప్రకటించారు. కాళేశ్వరం నిర్మాణంలో దోపిడీ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఏజన్సీలు ఇచ్చిన సమాచారం ప్రకారమే బీఆర్‌ఎస్‌కు ఆ ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించే వారని గుర్తు చేశారు.
కాళేశ్వరం అవినీతిపై పూర్తి సమాచారం ఉన్నా నాటి బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయినందునే కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామనీ, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామనీ, నల్లధనం బయటకు తీస్తామని ప్రకటించిన బీజేపీ నాయకులు ఇప్పుడు వాటిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment