న్యూఢిల్లీ: దశాబ్దాలుగా రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ ప్రస్తుతం వయోభారం కారణంగా ప్రజాసభను వదిలి ఎగువ సభకు తన రాజకీయ పథాన్ని మార్చుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తన నియోజకవర్గ ఓటర్లకు భావోద్వేగంతో ఒక లేఖ రాశారు. ‘‘ నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్ననంటే దానికి మీరే కారణమని గర్వంగా చెబుతా. మీ వల్లే, మీరు నాపై ఉంచిన నమ్మకం వల్లే నా శక్తిమేరకు మీకు సేవచేయగలిగాను.
అనారోగ్యం, వయోభారం సమస్యల కారణంగా ఇక మీదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయదల్చుకోలేదు. ఈ నిర్ణయం తర్వాత ప్రత్యక్షంగా మీకు సేవచేసే అవకాశం నాకు లేదని తెలుసు. కానీ నా మనసు నిండా మీరే ఉన్నారు. గతంలోలాగే ఇక మీదట కూడా మీరు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడతారని తెలుసు’’ అని హిందీలో సోనియా ఓటర్లకు ఒక సందేశం పంపారు. ‘‘ మీరు లేకుండా ఢిల్లీలో నా కుటుంబం సంపూర్ణం కాదు.
రాయ్‌బరేలీకి వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడే మొత్తం కుటుంబం అనే భావన కలుగుతోంది. మీ బంధం దశాబ్దాలనాటిది. నా అత్తగారి నుంచే నేనీ బంధాన్ని వారసత్వంగా పొందా. రాయ్‌బరేలీతో నా కుటుంబ బంధం బలంగా పెనవేసుకుంది. నా మామగారు ఫిరోజ్ గాంధీ స్వాతంత్య్ర సిద్ధించాక తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇందిరా గాంధీని ఆశీర్వదించి లోక్‌సభకు పంపారు. జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తోడుగా నిలిచి బంధాన్ని మరింత పటిష్టం చేశారు. అత్తను కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడూ మీ చెంతకొచి్చన నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు.
ఇంతటి మద్దతు, ప్రోత్సాహాన్ని జీవితంలో మరువను. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో గడ్డుపరిస్థితులు ఎదురైనా మీరు నావెంటే నడిచారు. నా కంటే పెద్దవారికి ధన్యవాదాలు, యువతకు ప్రేమాశీస్సులు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా’ అని సోనియా తన సందేశం పంపారు. రాజస్తాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలుచేసిన మరుసటి రోజు సోనియా తన నియోజకవర్గ ప్రజలను గుర్తుచేసుకుంటూ లేఖ రాయడం గమనార్హం. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుంచి సార్వత్రిక సమరంలో నిలబడతారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment