గిరిరాజ్ వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం | Congress raises Giriraj's remark on Sonia's skin colour in Lok Sabha, BJP says modi not involved | Sakshi
Sakshi News home page

గిరిరాజ్ వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం

Published Mon, Apr 20 2015 11:33 AM | Last Updated on Sat, Mar 9 2019 3:30 PM

గిరిరాజ్ వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం - Sakshi

గిరిరాజ్ వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ : కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై సోమవారం లోక్ సభలో దుమారం చెలరేగింది. పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు.... అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిందారోపణలతో మొదలయ్యాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభమైన వెంటనే... స్పీకర్ సుమిత్రా మహజన్ ఇటీవల మృతి చెందిన మాజీ  రాజ్యసభ ఎంపీలు, సింగపూర్ మాజీ  ప్రధాని లీక్వాన్‌ యూ, సుక్మా-దంతెవాడ పోలీసు అమరులు, కెన్యాఉగ్రవాది దాడిలో బలైపోయిన చిన్నారులకు.... నివాళులర్పిస్తూ సంతాన తీర్మానాన్ని చదివి వినిపించారు.

మృతులకు లోక్‌సభ సంతాపం అనంతరం.... విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.  అయితే దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టాయి.  సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ అనుచిత వ్యాఖ్యలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ఖర్గే మాట్లాడుతుండగా....బీజేపీ ఎంపీలు అడ్డుకోవడంతో సభలో దుమారం రేగింది.  బీజేపీ సభ్యుల తీరుపై ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యలు యావత్‌ మహిళాలోకాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ యువ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. తమ పార్టీ అధినేతపై చేసిన వ్యాఖ్యలకుగాను ఆయన క్షమాపణలతో పాటు స్వచ్చంధంగా రాజీనామా చేయాలని..... ప్రధాని కూడా క్షమాపణలు చెప్పాలని సింధియా డిమాండ్ చేశారు.  

దీనిపై కలగజేసుకున్న పార్లమెంటరీవ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష సభ్యులు లేవనెత్తిన ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని తెలిపారు.  స్పీకర్ అనుమతిస్తే చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న వెంకయ్య...గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై ప్రధాని మాట్లాడబోరని తేల్చిచెప్పారు.  ఈ వివాదంలోకి ప్రధానిని లాగవద్దని సూచించారు. ఈ దశలో మరోసారి సభలో రగడ రేగింది.   దాంతో స్పీకర్ సమావేశాలను 11.45 గంటల వరకూ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఇదే అంశంపై ఆందోళన కొనసాగించారు. దాంతో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్.. సోనియాగాంధీకి క్షమాపణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement