సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో ఢిల్లీలో ఒంటరిపోరుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాలకు గాను ఆరు స్ధానాలకు కాంగ్రెస్ తన అభ్యర్ధులను ప్రకటించింది. దేశ రాజధానిలో దిగ్గజ నేతలను ఆ పార్టీ రంగంలోకి దింపింది. ఢిల్లీ మాజీ సీఎం, నగర పార్టీ చీఫ్ షీలా దీక్షిత్‌ను ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీలో నిలిపింది. చాందినీ చౌక్ నుంచి జేపీ అగర్వాల్, తూర్పు ఢిల్లీ నుంచి అరవిందర్ లవ్లీ, న్యూఢిల్లీ నుంచి అజయ్ మాకెన్, రాజేష్ లిలోతియా వాయువ్య ఢిల్లీ, మహబ్‌లాల్ మిశ్రా పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.
గట్టి నేతలను బరిలో దింపడం ద్వారా ఆప్, బీజేపీలను దీటుగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ కసరత్తు సాగించినట్టు వెల్లడవుతోంది. మరోవైపు ఆప్‌తో పొత్తు కోసం కాంగ్రెస్‌లో కొందరు నేతలు చేసిన ప్రయత్నాలకు పార్టీ ఢిల్లీ చీఫ్ షీలా దీక్షిత్ గండికొట్టారు. కాంగ్రెస్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆమె పలుమార్లు స్పష్టం చేశారు. ఇక ఢిల్లీలో 4 లోక్‌సభ స్ధానాలను తాము ఇవ్వజూపినా పొత్తుకు ఆప్ విముఖత చూపిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా, ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరేలా కాంగ్రెస్ వైఖరి ఉందని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ సహా పంజాబ్, రాజస్ధాన్ సహా ఇతర ప్రాంతాల్లోనూ పొత్తు ఉండాలని ఆప్ పేర్కొనడంతోనే కాంగ్రెస్ వెనక్కితగ్గినట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment